బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి, 28 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ కేఎం తహ్సీన్ సౌరీ(K. M. Tahsif Sauri) డెత్ మిస్టరీ ఆ దేశంలో పెను సంచలనం సృష్టిస్తోంది. 2024లో అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్తున్న కీలక వీడియోను షూట్ చేసినట్లు భావిస్తున్న సౌరీ మృతదేహం, అక్టోబర్ 28న ఢాకాలోని తురాగ్ నదిలో లభ్యమైంది. అక్టోబర్ 27న బైక్ రిపేర్ కోసం ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన ఆయన మిస్సవగా, 24 గంటల తర్వాత నదిలో డెడ్‌బాడీగా తేలడంతో కుటుంబ సభ్యులు ఇది పక్కా మర్డర్ అని ఆరోపిస్తున్నారు.

Also Read : అమెరికా ఆర్మీ సంచలన నిర్ణయం.. యుద్ధం ముందే సామూహిక సమాధుల శిక్షణ.. కారణమిదే!

హసీనా ఎగ్జిట్ వీడియో వెలుగులోకి వచ్చాక, జమాతే ఇస్లామీ అనుబంధ పత్రిక ‘అమర్ దేశ్’ సౌరీపై తీవ్ర ఆరోపణలు చేసింది. భారత నిఘా సంస్థ ‘RAW’తో సౌరీకి సంబంధాలు ఉన్నాయని, ఎయిర్‌ఫోర్స్ విచారణ తర్వాత ఆయన పాస్‌పోర్ట్ కూడా సీజ్ చేశారని కథనాలు రాసింది. ఆ తర్వాత ఆయన బలవంతంగా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే, బంగ్లాదేశ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఈ ఆరోపణలను ఖండించింది. విదేశీ ఏజెన్సీలతో లింకుల వల్ల కాకుండా, సర్వీస్ నిబంధనల ప్రకారమే రిటైర్ చేశామని క్లారిటీ ఇచ్చింది.

ఈ ఏడాది జూలైలో ‘స్పీక్ విత్ రషీద్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సౌరీ, అమర్ దేశ్ కథనాలను తప్పుడు ప్రచారంగా కొట్టిపారేశారు. హసీనా వీడియో వల్ల ఉద్యోగం పోయిందా అన్న ప్రశ్నకు “అవకాశం ఉండొచ్చు” అని చెప్పారు. అలాగే 2025లో 37 మంది చనిపోయిన చెంగ్డు FT-7BGI ఫైటర్ జెట్ క్రాష్‌పై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఇంటర్వ్యూ వైరల్ అయ్యాక ఆయన తీవ్ర ప్రాణభయంతో ఉన్నారని తండ్రి తెలిపారు.

మరోవైపు హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ ఈ మరణంపై స్పందిస్తూ.. అసత్య ప్రచారాలతో సౌరీ కెరీర్‌ను, జీవితాన్ని నాశనం చేసి అన్యాయంగా బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసు బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read : ఇరాన్‌పై దాడులకు సిక్రెట్ ప్లాన్.. వైట్ హౌస్‌లో ట్రంప్‌కు సైనికాధికారుల షాకింగ్ బ్రీఫింగ్!