తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు పావలా శ్యామల. సహజమైన నటన, అమాయకత్వంతో కూడిన హాస్యంతో వెండితెరపై ఎంతోమందిని అలరించిన ఈ సీనియర్ నటి హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ గుండె పోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్రమైన వృద్ధాప్య సమస్యలు, పలు తీవ్ర అనారోగ్య కారణాలతో బాధపడ్డారు. అయితే తెరపై నవ్వులు పూయించిన శ్యామల నిజజీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారు. అసలు శ్యామల సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఈమెకు పావలా శ్యామాలాగా ఎలా మారిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Also Read : ‘గబ్బర్ సింగ్’ నటుడి కుటుంబానికి చిరంజీవి భారీ ఆర్థిక సాయం..

పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆమె ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఈమెకు చిన్నప్పటి నుంచి నాటకాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రాకముందు ఆమె రంగస్థలంపై ఎంతో చురుగ్గా ఉంటూ అనేక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ సమయంలో ప్రముఖ రచయిత గణేష్ పాత్రో రాసిన “పావలా” అనే ఒక నాటికలో శ్యామల కీలక పాత్ర పోషించారు.

ఆ నాటికలో శ్యామల చూపించిన హావభావాలు, నటన నాటకాభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేవలం ఆ ఒక్క నాటికకే ఆమెకు దాదాపు 200లకు పైగా అవార్డులు రావడం విశేషం. ఆ పాత్రతో వచ్చిన విపరీతమైన గుర్తింపు కారణంగా నాటకాభిమానులు ఆమెను “పావలా శ్యామల” అని పిలవడం ప్రారంభించారు. ఆ తర్వాత నాటక రంగానికి, సినీ రంగానికి కూడా ఇదే పేరు ఉండిపోయింది. రేడియో ఆర్టిస్ట్‌గా, రంగస్థల కళాకారిణిగా మంచి పేరు తెచ్చుకున్న శ్యామల 1980లో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. హాస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా శ్యామల దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు.

Also Read : చెన్నైలో నయా లవ్.. కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉందంటే?

ముఖ్యంగా హాస్య బ్రహ్మ జంద్యాల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలతో పాటు ‘బాబాయ్ హోటల్’, ‘స్వర్ణకమలం’, ‘కర్తవ్యం’, ‘సుస్వాగతం’, ‘మనసంతా నువ్వే’, ‘ఇంద్ర’, ‘ఖడ్గం’, ‘ఆంధ్రావాలా’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పల్లెటూరి ముసలమ్మ పాత్రలకు, అమాయకమైన డైలాగ్ డెలివరీకి ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.

సినిమాల్లో నవ్వులు పూయించిన పావలా శ్యామల వ్యక్తిగత జీవితం మాత్రం చాలా విషాదకరంగా సాగింది. కుమార్తె పుట్టిన కొద్దికాలానికే ఓ ప్రమాదంలో ఆమె భర్త చనిపోయారు. దీంతో ఏ ఆధారమూ లేకపోయినా ఒంటరిగానే తన కుమార్తె మాధవిని పెంచి పెద్ద చేశారు. తీరా కుమార్తె పెద్దయ్యాక ప్రమాదవశాత్తూ మేడపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. కూతురి వైద్యం కోసం విశాఖపట్నంలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేశారు. కూతురిని కాపాడుకోవడానికి ఆమె పూర్తిస్థాయిలో నటననే నమ్ముకుని కష్టపడ్డారు.

వయస్సు పైబడటంతో శ్యామల నడవలేని, కనీసం నిలబడలేని స్థితికి చేరుకున్నారు. దీనికి తోడు పలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. సరిపడా ఆదాయం లేకపోవడం, అద్దె ఇల్లు కావడం, డాక్టర్ల ఖర్చులు పెరిగిపోవడంతో ఆమె చివరి రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు.

గతంలో పవన్ కళ్యాణ్, దిల్ రాజు, తెలంగాణ ప్రభుత్వం, పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆర్థిక సహాయం అందించినప్పటికీ ఆమె పరిస్థితి మళ్లీ దయనీయంగా మారింది. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. శ్యామల మృతిపట్ల టాలీవుడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.