Mega158 : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు డైరెక్టర్ బాబీ ఓ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే నేడు విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై హైప్‌ను తారాస్థాయికి చేర్చింది.

ఈ చిత్రానికి కాకా అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు చూడని సరికొత్త మధ్యతరగతి వ్యక్తిగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

సినిమా వివరాల్లోకి వెళితే, ఇందులో చిరంజీవి ఒక అక్వా సంస్థలో ఉద్యోగిగా సత్యం అనే పాత్రలో నటిస్తున్నారు. టీజర్‌లో చిరంజీవి చెప్పిన ఇది సత్య మాట.. ఇంకా డౌటా అనే పవర్ ట్యాగ్‌లైన్ ఆయన పాత్ర స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని అద్దం పడుతోంది. అలాగే ఇందులో కనిపించిన ఐ లవ్‌ డాడీ అనే కీ చైన్ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో తండ్రీకొడుకుల మధ్య ఉండే బలమైన భావోద్వేగ బంధాన్ని తెలియజేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

మధ్యతరగతి ఉద్యోగిగా సింపుల్‌గా కనిపించిన చిరంజీవి, టైటిల్ రివీల్ అయిన వెంటనే ఒక్కసారిగా యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లోకి మారిపోయారు. చేతిలో గన్స్ పట్టుకుని ఆయన ఇచ్చిన మాస్ పోజులు చూస్తుంటే, మెగాస్ట్రా అభిమానులకు పాత రోజులను గుర్తు చేసేలా వింటేజ్ చిరును మరోసారి తెరపై చూడబోతున్నామనే నమ్మకం కలుగుతోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పించే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి బాబీ సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి రెండు భిన్నమైన కోణాల్లో సాగే పాత్రలో అలరించనున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మాస్, ఎమోషన్స్, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉండేలా ఈ కథను దర్శకుడు తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ బాణీలు సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.

అన్ని హంగులను పూర్తి చేసుకుని ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాను సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పండగ సీజన్‌లో మెగాస్టార్ బాక్సాఫీస్ బాట పట్టనుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.