Gurugram :గురుగ్రామ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన భార్యను చంపి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోవడానికి ముందు అతడు పనిచేసే కంపెనీకి మేం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నాం అని మెయిల్ పంపాడు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ చనిపోయిన స్థితిలో కనిపించారు. చనిపోయిన వారిని కేరళకు చెందిన మొహమ్మద్ అస్లాం (30), ఆయన భార్య ఫర్హానాగా గుర్తించారు. వీరిద్దరూ గురుగ్రామ్‌లోని ఎంథ్రీఎం మెరీనా అనే అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. బుధవారం వీరి మృతదేహాలు ఫ్లాట్‌లో కనిపించాయి. అదే రోజు ఫర్హానా పుట్టినరోజు కావడం గమనార్హం.

బుధవారం ఉదయం 7 గంటల సమయంలో అస్లాం తన కంపెనీకి ఓ మెయిల్ పంపాడు. అందులో తన కుటుంబ సభ్యులు, ఇంటి యజమాని ఫోన్ నంబర్లు కూడా ఇచ్చాడు. ఆ మెయిల్ చూసిన అస్లాం సహోద్యోగులు వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ఫ్లాట్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ అస్లాం ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఫర్హానా నేలపై చనిపోయి పడి ఉంది. ఆమె మెడపై గాయాలు ఉన్నట్లు తెలిసింది. ఇంటి యజమాని వెళ్లే సమయానికి ఫ్లాట్ తలుపు తెరిచే ఉంది. పోలీసులు ఫ్లాట్‌ను చూడగా.. మేం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నాం అని రాసి ఉన్న ఓ కాగితం దొరికింది. ఫర్హానా దుస్తులపై ఐ లవ్ యూ అని చేతితో రాసి ఉన్నట్లు కూడా గుర్తించారు. ఫ్లాట్‌లో మూడు ల్యాప్‌టాప్‌లు, రెండు ఫోన్లు, ఓ తాడు, డైరీ, కత్తెర, పెన్‌డ్రైవ్‌ను పోలీసులు తీసుకున్నారు. వీటిని పరీక్షల కోసం పంపించారు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు వీటిని పరిశీలిస్తున్నారు.

అస్లాం మొదట తన భార్యను చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేశారు. అయితే, భార్యాభర్తలు ఎలా చనిపోయారనే విషయం ఇంకా పూర్తిగా తెలియలేదు. అస్లాం, ఫర్హానా ఇద్దరూ ఐటీ ఉద్యోగులు. వీరిది కేరళ. దాదాపు మూడు నెలల క్రితం బెంగళూరు నుంచి గురుగ్రామ్‌కు వచ్చారు. 2023లో వీరికి పెళ్లయింది. అస్లాం కాలికట్‌లోని ఎన్‌ఐటీలో, ఇండోర్‌లోని ఐఐఎంలో చదువుకున్నాడు. ఫర్హానా కూడా ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె ఇంటి నుంచే పని చేసేది.

కుటుంబ సభ్యుల మాటల ప్రకారం, అస్లాం, ఫర్హానా ఇద్దరూ చాలా దగ్గరగా ఉండేవారు. వారి మధ్య గొడవలు ఉన్నట్లు కూడా తమకు తెలియదని బంధువులు చెబుతున్నారు. అయితే, అస్లాం గత ఏడాదిన్నరగా డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఐటీ రంగంలో ఎక్కువ పని ఉండటం, పని ఒత్తిడి ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం బాద్‌షాపూర్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.