Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి, అతను గుండెపోటుతో చనిపోయాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. అయితే భర్త ఫోన్‌లో దొరికిన ఓ చాట్‌ ఈ హత్య వెనుక అసలు కథను బయటపెట్టింది. మీరట్‌లోని లోహియా నగర్‌లో ఈ ఘటన జరిగింది. మృతుడిని 30 ఏళ్ల తాలిబ్‌గా గుర్తించారు. అతని భార్య ఇల్మా (27) బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. వీరిద్దరికీ నాలుగేళ్ల క్రితం పెళ్లి కాగా, మూడేళ్ల కుమార్తె ఉంది.

హత్య జరిగిన రోజు తాలిబ్‌ పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడని ఇల్మా తన అన్న అక్ఱమ్‌కు చెప్పింది. మంచంపై పడుకున్న తాలిబ్‌ కొద్దిసేపటికే చనిపోయాడని తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు అతను సహజంగానే చనిపోయాడని భావించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆ తర్వాత తాలిబ్‌ మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. అక్టోబర్‌ 1న తాలిబ్‌ బంధువు రైస్‌ ఇల్మా ఇంటికి వెళ్లాడు. తాలిబ్‌ మొబైల్‌ ఫోన్‌ను ఇల్మా దాచిపెట్టింది. అయితే రైస్‌ దాన్ని ఆమె బట్టల కింద గుర్తించాడు.

ఆ ఫోన్‌లో తాలిబ్‌, అమన్‌ అనే వ్యక్తి మధ్య జరిగిన చాట్‌ కనిపించింది. తన భార్యతో మాట్లాడవద్దని తాలిబ్‌ అమన్‌ను హెచ్చరించినట్లు అందులో ఉంది. దీంతో కుటుంబ సభ్యులు ఇల్మాను గట్టిగా ప్రశ్నించగా.. చివరకు ఆమె తన భర్తను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తాలిబ్‌ తనను తరచూ కొట్టేవాడని ఇల్మా పోలీసులకు చెప్పింది. సెప్టెంబర్‌ 28న కూడా తనపై దాడి చేయడంతో ఆమె తన ప్రియుడు అమన్‌కు ఫోన్‌ చేసింది. అమన్‌ మరో వ్యక్తితో కలిసి ఇల్మా ఇంటికి వచ్చాడు. ముగ్గురూ కలిసి తాలిబ్‌పై దాడి చేశారు. ఆ తర్వాత అమన్‌ చున్నీతో తాలిబ్‌ మెడకు ఉరి బిగించి చంపినట్లు ఇల్మా చెప్పింది. అనంతరం తనను పెళ్లి చేసుకుంటానని అమన్‌ హామీ ఇచ్చినట్లు తెలిపింది.

ఈ ఘటనపై కోత్వాలీ సర్కిల్‌ ఆఫీసర్‌ సంగ్రామ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఈ విషయంపై జిల్లా మేజిస్ట్రేట్‌కు నివేదిక పంపినట్లు తెలిపారు. మంగళవారం తాలిబ్‌ మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇల్మాను పోలీసులు తమ పర్యవేక్షణలో ఉంచారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.