
Pune Murder Case : పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్‌కు ప్రముఖ న్యాయవాది అశుతోష్ శ్రీవాస్తవ రూ. 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం నోటీసు పంపించారు. సాహిల్ గోయల్ తనపై తప్పుడు, అబద్ధపు ఆరోపణలు చేస్తూ తన వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించారని శ్రీవాస్తవ ఈ నోటీసులో పేర్కొన్నారు.
ఓ ఇంటర్వ్యూలో సాహిల్ గోయల్ సంచలన కామెంట్స్ చేశారు. తమ కుటుంబం తరఫున వాదించడానికి న్యాయవాది అశుతోష్ శ్రీవాస్తవను తాము నియమించుకోలేదని ఆయన చెప్పారు. అంతేకాకుండా, శ్రీవాస్తవ ఏదో ఒక మాయమాట చెప్పి లేదా మోసం చేసి జైలులో ఉన్న సియా గోయల్ దగ్గర కొన్ని లీగల్ పేపర్లపై సంతకాలు చేయించుకుని ఉంటారని సాహిల్ ఆరోపించారు. తమ కుటుంబం సియా తరఫున వాదించడానికి అడ్వకేట్ విపుల్ దుషింగ్‌ను నియమించుకుందని, ఈ మేరకు కోర్టులో అఫిడవిట్ కూడా సమర్పించామని సాహిల్ కోర్టు విచారణకు ముందే బహిరంగంగా వెల్లడించారు. అలాగే శ్రీవాస్తవ తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు.
అయితే సాహిల్ గోయల్ చేసిన ఈ వ్యాఖ్యలను అడ్వకేట్ శ్రీవాస్తవ తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలన్నీ అబద్ధాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. సాహిల్ వెంటనే తన ఆరోపణలను వెనక్కి తీసుకుని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై శ్రీవాస్తవ మాట్లాడుతూ.. “మా లీగల్ టీమ్ నేరుగా సియా గోయల్‌ను కలిసింది. ఆమెకు న్యాయ సహాయం కావాలి కాబట్టే పూర్తి ఇష్టపూర్వకంగా న్యాయవాది అధికార పత్రంపై సంతకం చేసి ఇచ్చింది. సియా మేజర్, ఆమెకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. మేము ఎప్పుడూ సాహిల్ గోయల్‌తో మాట్లాడలేదు, కాబట్టి ఆయన మాటల్లో నిజం లేదు. బాంబే హైకోర్టు వరకు మాకు ప్రాతినిధ్యం వహించేలా ఆమె సంతకం చేసిన పత్రాలు మా దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే ఈ నోటీసుపై సాహిల్ గోయల్ ఇంకా స్పందించలేదు.
Also Read : సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
కుటుంబ పరువు పోతుందని
కాగా 20 ఏళ్ల సియా గోయల్‌కు రియల్టర్ కేతన్ అగర్వాల్‌తో పెళ్లి నిశ్చయమైంది. అయితే ఆమెకు ఆ పెళ్లి ఇష్టం లేదు, అలాగని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే తమ కుటుంబ పరువు పోతుందని భావించింది. అందుకే తన 22 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్ చౌదరితో కలిసి కేతన్‌ను చంపేయడానికి ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం పూణే జిల్లాలోని లోహగఢ్ కోటపైకి కేతన్‌ను తీసుకెళ్లి, అక్కడి కొండపై నుంచి కిందకు తోసేసి హత్య చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో నిజాలను బయటకు తీసేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
Also Read : ఫ్రీ ఫైర్ ఆన్ లైన్ గేమ్ వేదికగా బాలికలకు వల.. మాయగాళ్ల సరికొత్త పంథా









