
US : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గుండెల్ని పిండేసే దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం 19 ఏళ్ల భారత సంతతి యువకుడు తన తల్లిదండ్రులను, నానమ్మను తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశాడు. ఈ ముగ్గురినీ పొట్టనబెట్టుకోవడమే కాకుండా తన అన్నపై కూడా అతను కాల్పులు జరిపాడు. అయితే, ఆ అన్న తృటిలో ప్రాణాలతో తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం బయటపడింది. నిందితుడిని గౌరవ్ చోప్రాగా పోలీసులు గుర్తించారు.
టెక్సాస్‌లోని ఆల్టన్ నగరంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు గౌరవ్ చోప్రా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ రియో గ్రాండే వ్యాలీలో చదువుతున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో అతను అకస్మాత్తుగా తన కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తల భాగంలో తీవ్రంగా గాయపడటంతో గౌరవ్ తల్లి కమలేష్ రాణి (46), నానమ్మ మిందర్ కౌర్ (73) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గౌరవ్ అన్న సచిన్ చోప్రా (21) పై కూడా అతను తుపాకీ గురిపెట్టి కాల్చాడు. కానీ ఆ బుల్లెట్ తగలకుండా తప్పించుకున్న అన్న.. వెంటనే పరుగెత్తి ప్రాణాలు రక్షించుకుని ‘911’ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే తల్లి, నానమ్మ మరణించి ఉండగా.. తండ్రి స్వీరా రామ్ (56) తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండడం గమనించారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన కూడా కన్నుమూశారు. కాగా, కాల్పులు జరిపిన అనంతరం గౌరవ్ చోప్రా తన తెల్లటి లెక్సస్ కార్లో అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు అతని కారును వెంబడించడంతో సినిమా సీన్లను తలపించేలా ఛేజింగ్ జరిగింది. తప్పించుకునే క్రమంలో గౌరవ్ కారు వేగంగా వెళ్లి మరో రెండు వాహనాలను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ వాహనాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. పోలీసులు గౌరవ్‌ను అదుపులోకి తీసుకుని, అతని కారులో ఉన్న హ్యాండ్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
గురువారం నాడు హిడాల్గో కౌంటీ కోర్టులో నిందితుడు గౌరవ్ చోప్రాను ప్రవేశపెట్టారు. ఒకేసారి ముగ్గురిని దారుణంగా హత్య చేసినందుకు అన్నను చంపేందుకు ప్రయత్నించినందుకు, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినందుకు అతనిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల తీవ్రతను బట్టి న్యాయమూర్తి అతనికి ఎలాంటి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ జైలుకు తరలించారు.
అంతా ప్రశాంతంగానే
ఈ ఘోరానికి ఒడిగట్టడానికి గల అసలు కారణం ఏమిటనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు. హిడాల్గో కౌంటీ షెరీఫ్ ఎడ్డీ గెర్రా మాట్లాడుతూ.. విచారణ సమయంలో నిందితుడు కొన్ని విషయాలు చెప్పాడని, కానీ అవి ఏమాత్రం నిజం కావని తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. గతంలో ఈ కుటుంబం ఉన్న ఇల్లు లేదా నివాసం నుండి పోలీసులకు ఎలాంటి గొడవల గురించిన ఫోన్ కాల్స్ రాలేదని, అంతా ప్రశాంతంగానే ఉండేవారని పేర్కొన్నారు. గౌరవ్ తండ్రి స్వీరా రామ్ ఆ ప్రాంతంలో పేరున్న వ్యాపారవేత్త అని, మోటెల్ ఈవెంట్ సెంటర్లను నడుపుతూ అందరితో మంచిగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. కాగా, తమ కాలేజీ స్టూడెంట్ ఇలాంటి నేరంలో ఇరుక్కున్నందుకు యూనివర్సిటీ యాజమాన్యం విచారం వ్యక్తం చేస్తూ, పోలీసుల దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని ప్రకటించింది.









