
Hanamkonda : హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. భార్య కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి చంపిన ఈ ఘటన యాదవనగర్‌లో చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 4వ డివిజన్లో ఈ దారుణం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదవనగర్‌కు చెందిన అనిల్, రజిత (31) ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు తలెత్తడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే శనివారం రాత్రి దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో రగిలిపోయిన అనిల్.. భార్య రజిత కాళ్లు, చేతులను బెడ్‌కు కట్టేసి, కత్తితో గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు.
ఈ రాక్షస క్రియకు పసివాడైన వారి నాలుగేళ్ల కుమారుడే ప్రత్యక్ష సాక్షిగా నిలవడం అందరినీ కలచివేసింది. “అమ్మను నాన్న తన్నుతూ తిడుతూ కొట్టాడు. అమ్మ కాళ్లు, చేతులను నాన్న బెడ్‌కి కట్టేశాడు. అమ్మ ఎంత అరుస్తున్నా వినకుండా కత్తితో పొడిచాడు” అంటూ ఆ చిన్నారి అమాయకంగా చెప్పిన మాటలు విన్నవారందరి గుండెల్ని పిండేస్తున్నాయి. కళ్ల ముందే కన్నతల్లి దారుణ హత్యకు గురికావడంతో ఆ చిన్నారులు అనాథలుగా మారారు.
సమాచారం అందుకున్న కాకతీయ వర్సిటీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేవలం కుటుంబ కలహాలే ఈ హత్యకు దారితీశాయా? లేక వెనుక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.









