
Ranga Reddy : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఆరుగురి దారుణ హత్యల ఉదంతంలో మరికొన్ని భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం తెల్లవారుజామున వెలుగుచూసిన ఈ నరమేధం.. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట మధ్యే జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. బాలికను వేధించిన కేసులో మే 26న అరెస్ట్ అయిన రాజ్‌కుమార్, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. తనపై పోక్సో కేసు పెట్టారనే పగతో రగిలిపోయిన అతడు.. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బాధిత బాలిక ఇంటికి వెళ్లాడు. బాలిక అమ్మమ్మ, నాయనమ్మలు అడ్డుపడి వారించినప్పటికీ వినకుండా, బాలికను బలవంతంగా తన కారులో ఎక్కించుకున్నాడు. ఊరి శివారల్లో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి, ఆమెపై దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎక్కడ దొరికిపోతానోనన్న భయంతో అక్కడే ఆమె గొంతు కోసి కిరాతకంగా చంపేశాడు.
Also Read : పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు
అక్కడితో నిందితుడి ఉన్మాదం చల్లారలేదు. తిరిగి బాలిక ఇంటికి వచ్చి, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు బాలిక అమ్మమ్మ చిట్యాల రుక్కమ్మ (65), నాయనమ్మ చిట్యాల లక్ష్మి (45)లను కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి, పిల్లల్ని చూస్తానని భార్య పార్వతి సరిత (30)కు ఫోన్ చేశాడు. నిందితుడు ఇంట్లోకి వెళ్లగానే భార్యపై కత్తితో విరుచుకుపడ్డాడు. ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీసినా, వదలకుండా మళ్లీ ఇంట్లోకి లాక్కెళ్లి అతి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం నిద్రపోతున్న తన మూడేళ్ల కుమారుడు పరీక్షిత్, రెండేళ్ల కుమార్తె దైవిక్షిత్‌లను కూడా గొంతు కోసి బలితీసుకున్నాడు.
రెండు గంటల వ్యవధిలో ఆరుగురిని పొట్టనబెట్టుకున్న రాజ్‌కుమార్, ఆ తర్వాత కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. పారిపోతూ తన తండ్రికి, బంధువులకు ఫోన్ చేసి.. నేను ఆరుగురిని చంపేశాను, నేను కూడా చనిపోతున్నాను అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు.
Also Read : రూ.600 కోట్ల ఆస్తి.. మనవడి మరణాన్ని తట్టుకోలేక..కేతన్ అగర్వాల్ ఇంట మరో విషాదం…









