
అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో హనీట్రాప్, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. టిన్సుకియాకు చెందిన ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 2న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జోర్హాట్ సదర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ హృషీకేశ్ హజారికా తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బ్యాంక్ మేనేజర్‌కు జూలైలో ఇన్స్టాగ్రామ్ ద్వారా జోర్హాట్కు చెందిన ఓ మహిళ పరిచయమైంది. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో పరిచయం కాస్త సన్నిహితంగా మారింది. ఆగస్టు 14న ఆమె అతడిని జోర్హాట్కు రావాలని పిలిచింది. ఆమెను కలిసేందుకు బ్యాంక్ మేనేజర్ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జోర్హాట్కు వెళ్లాడు. అక్కడ ఆమె అతడిని సియోని అలీ ప్రాంతంలోని ఓ అద్దె ఇంటికి తీసుకెళ్లింది. ఇద్దరూ ఇంట్లో ఉండగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తలుపు కొట్టారు.
ఆ మహిళ తలుపు తీయగానే వారు లోపలికి చొరబడ్డారు. బ్యాంక్ మేనేజర్‌ను వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని, అతడి కుటుంబ సభ్యులకు కూడా పంపిస్తామని బెదిరించినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వీడియో బయటపెడతామని బెదిరించి బ్యాంక్ మేనేజర్‌ను రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. భయంతో అతడు ఆ మొత్తాన్ని వారికి ఇచ్చాడు. ఆ తర్వాత కూడా మరో రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయడంతో దానిని కూడా చెల్లించినట్లు పోలీసులు తెలిపారు.
మొత్తంగా బ్యాంక్ మేనేజర్ నుంచి ఆ ముఠా రూ.3 లక్షలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కూడా మరో రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెదిరింపులు పదేపదే కొనసాగడంతో చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఈ కేసులో గత శుక్రవారం ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని గర్మూర్ ప్రాంతానికి చెందిన సంజీబ్ దాస్, అంకిత్ పాల్గా గుర్తించారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
దర్యాప్తులో మొరోమీ దాస్ నియోగ్ ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానించారు. ఆమె కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని డిబ్రూగఢ్‌కు పంపారు. మొదట ఆమె ఆచూకీ లభించలేదు. తర్వాత అందిన పక్కా సమాచారం ఆధారంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో మహిళ బేబీ బోరాతో పాటు ఆమె భర్త అంకిత్ బోరాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో వారి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులను, ముఖ్యంగా వ్యాపారులను టార్గెట్ చేసేదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, ఆ తర్వాత వారిని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.









