Delhi :  పెళ్లయిన కేవలం రెండు నెలలకే ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘోర ఘటన ఢిల్లీలోని లోధి కాలనీ పరిధిలో జరిగింది. ఆకృతి (28) అనే వివాహిత అక్కడి ఎన్డీఎంసీ ఫ్లాట్స్, పాలికా కుంజ్ బిల్డింగ్ పైనుంచి కింద పడిపోయింది. ఆమె భవనం పైనుంచి దూకిందా లేక ఎవరైనా నెట్టేశారా అనేది స్పష్టంగా తెలియదు కానీ, బిల్డింగ్ బయట నేలపై ఆమె మృతదేహం పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.

ఢిల్లీలోని పుష్ప్ విహార్‌కు చెందిన ఆకృతికి, ఈ ఏడాది ఏప్రిల్ 24న వివాహమైంది. ఆమె ఛతర్‌పూర్‌లోని ఒక కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ఎంతో సంతోషంగా ఉండాల్సిన నవవధువు ఇలా శవమై కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర కన్నీరుమున్నీరవుతున్నారు. ఇది ఆత్మహత్య కాదని, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యేనని ఆకృతి కుటుంబ సభ్యులు గట్టిగా ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసం ఆమె భర్త, అత్తమామలు పెళ్లయినప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆకృతిది హత్యేనని, కానీ ఆమె అత్తమామలు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె సోదరుడు ఆరోపించాడు. తన చెల్లెలు మానసికంగా ఎంతో ధైర్యవంతురాలని, ఆమె అంత సులభంగా ప్రాణాలు తీసుకునే పిరికిది కాదని స్పష్టం చేశాడు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొత్తగా పెళ్లయిన మహిళ కావడం వల్ల ఆర్డీఓ విచారణకు కూడా ఆదేశించారు. ఈ కేసును ఆత్మహత్య, హత్య, కట్నం వేధింపులు.. ఇలా అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిజానిజాలు త్వరలోనే బయటపెడతామని పోలీసులు తెలిపారు.

 

 

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.