Baingan Bharta : భోపాల్‌: వంకాయ కూరతో చపాతీలు తిన్న ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురై ఆ తర్వాత అనుమానస్పదంగా మరణించడం కలకలం రేపింది. కాగా, ఆ ముగ్గురు చిన్నారుల మృతదేహాలను కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేశారు. అయితే కొంతమంది స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, వైద్య బృందం కలిసి బాలికల మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం తరలించడం సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

భోపాల్‌లోని పిపోరా ఖుర్ద్ గ్రామానికి చెందిన బాల్‌ముకుంద్ కుష్వాహ కుమార్తెలైన 7 ఏళ్ల పూనమ్, మూడేళ్ల మనీషా, 9 నెలల చిన్నారి చాహత్ లు ఒకేసారి అనుమానాస్పదంగా మరణించారు. శుక్రవారం రాత్రి వారు భోజనంలో భాగంగా వంకాయ కూరతో చపాతీలు తిన్న తర్వాత ఆ ముగ్గురు పిల్లలు అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనంతరం అనారోగ్యంతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలను కుటుంబ సభ్యులు ఖననం చేశారు.

కాగా, ఈ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, వైద్యులతో కలిసి ఆ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం పిల్లల మృతదేహాలను పూడ్చిపెట్టిన స్థలాన్ని పరిశీలించారు. వారి మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి సంబంధిత ఆధారాలను సేకరించారు. అయితే, బాలికల మరణాలకు తిన్న ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా లేదా మరైదైనా కారణమా అనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారణ కాలేదు.

మరోవైపు పిల్లలు సడన్‌గా అనారోగ్యానికి గురై మరణించడంపై కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు అందిన తర్వాత వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీస్‌ అధికారి తెలిపారు. ముగ్గురు చిన్నారుల మరణాలకు దారితీసిన పరిస్థితులు అస్పష్టంగా, అనుమానాస్పదంగా ఉన్నాయని పోలీసులు అంటున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.