
Japan : జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు జపాన్‌తో పాటు రాజధాని టోక్యో ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారని, అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. సునామీ వచ్చే ప్రమాదం లేదని స్పష్టం చేశారు. జపాన్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రిఫెక్చర్‌లోని దక్షిణ ప్రాంతంలో భూగర్భంలో 70 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే దీని తీవ్రతను 5.8గా నమోదు చేసింది.
ఈ భూకంపం కారణంగా నాలుగు ప్రిఫెక్చర్లలో మొత్తం 23 మంది గాయపడ్డారు. సాయితామాలో 9 మంది, కనగావాలో 9 మంది, చిబాలో 4 మంది, ఇబారాకీలో ఒకరు గాయపడ్డారు. నిద్రపోతున్న సమయంలో భూకంపం రావడంతో భయంతో పడక నుంచి లేచి పరుగులు తీసే క్రమంలో కిందపడి, తలుపులు లేదా ఫర్నిచర్‌కు తగిలి ఎక్కువమంది గాయపడ్డారు. కనగావా ప్రిఫెక్చర్‌లోని యోకోహమాలో 80 ఏళ్ల వృద్ధురాలు మంచంపై నుంచి కిందపడటంతో ఆమె తుంటికి తీవ్ర గాయమైంది.
భూకంపం కారణంగా టోక్యో, నరితా విమానాశ్రయానికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే కొన్ని లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే షింకన్సెన్ బుల్లెట్ రైళ్లు మాత్రం యథావిధిగా నడిచాయని ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ తెలిపింది.
నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. మొబైల్ ఫోన్లలో ఎమర్జెన్సీ భూకంప హెచ్చరికలు మోగడంతో టోక్యో నగరం ఒక్కసారిగా వణికిపోయింది. టోక్యోలోని కోటో ప్రాంతంలో భూగర్భ నీటి పైపు పగిలి రోడ్డుపైకి నీరు చేరింది. అయితే సిబ్బంది వెంటనే స్పందించి పైపును రిపేర్ చేసి లీకేజీని అరికట్టారు.
భూకంపం కారణంగా టోక్యోలో సుమారు 460 ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు దేశంలోని సుమారు డజనుకు పైగా అణు విద్యుత్ కేంద్రాలు, అణు సంబంధిత కేంద్రాల నుంచి ఎలాంటి ప్రమాదకర సమాచారం రాలేదు. గత నెలలో జపాన్ దక్షిణ ద్వీపమైన క్యుషులోని కుమమోటో ప్రాంతంలో 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి 38 మంది మృతి చెందగా, 364 మంది గాయపడ్డారు. ఆ భూకంపం వల్ల 1,500లకు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి.









