
Gold Mine Collapses : మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగారు గని కుప్ప కూలిన ఘటనలో 30 మంది మృతి చెందారు. పలువురు గనిలో చిక్కుకుపోవడం కలకలం రేపింది. పశ్చిమ ప్రాంతంలోని నానా-మాంబెరె అబ్బా పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ గని ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోవడంతో సుమారు 30 మంది గని కార్మికులు మృతి చెందగా ..మరికొందరు అందులో చిక్కుకుపోయారని అధికారులు, స్థానికులు వెల్లడించారు. స్పందించిన అధికారులు, స్థానికులు, తోటి కార్మికులు గంటల పాటు శ్రమించి 30 మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read : యూఏఈపై మిస్సైల్ దాడి.. ఇరాన్‌తో అన్ని వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు రద్దు
కాగా, ఇంకా పలువురు గనిలో చిక్కుకున్నారు. అయితే వారిని సజీవంగా బయటకు తీసే అవకాశాలు సన్న గిల్లుతున్నాయని ప్రమాదం నుంచి బయటపడిన ఓ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో పాటు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించింది. గనిలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపింది. కాగా, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌లో ఇలాంటి చిన్న తరహా బంగారు గనులు చాలా ఉండగా వాటిల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. సరైన రక్షణ, భద్రతా చర్యలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక బురదలో కూరుకుపోయిన కార్మికుల మృతదేహాలతో ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది. సహాయం కోసం పలువురు కేకలు వేస్తుండటంతో ఆ ప్రాంతమంతా మరుభూమిని తలపించింది. బాధితకుటుంబాలను ఆదుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, మధ్య ఆఫ్రికా గణ తంత్రంలో సరైన రక్షణ చర్యలు లేకపోవడం వల్ల గనులు కూలిపోవడం సర్వసాధారణం. గని కార్మికులకు సాధారణంగా తగినంత రక్షణ ఉండకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.
Also Read : ‘హర్మూజ్.. అమెరికాలో భాగం’..సంచలన ఫొటో షేర్ చేసిన ట్రంప్









