
Meta : అమెరికాలో సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థకు వ్యతిరేకంగా ఒక కీలకమైన కేసు విచారణ ప్రారంభమైంది. పిల్లలను తమ యాప్‌లకు అలవాటు పడేలా చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై మెటాపై 29 అమెరికా రాష్ట్రాలు కలిసి ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారు ఎక్కువ సమయం ఆన్లైన్లోనే గడిపేలా మెటా సంస్థ ఉద్దేశపూర్వకంగానే కొన్ని ఫీచర్లను తయారు చేసిందని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం భవిష్యత్తులో మొత్తం టెక్ రంగానికే ఒక ఉదాహరణగా నిలుస్తుందని, అందుకే నిపుణులు ఈ కేసును సోషల్ మీడియా రంగానికి బిగ్ టొబాకో మోమెంట్ అని పిలుస్తున్నారు.
మెటా ప్లాట్‌ఫామ్‌ల వల్ల పిల్లలు, టీనేజర్లు సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతూ మానసికంగా ప్రభావితమయ్యేలా దాని డిజైన్ ఉందనేది అమెరికా రాష్ట్రాల ప్రధాన ఆరోపణ. కాలిఫోర్నియా తరఫున కోర్టులో వాదనలు వినిపించిన ప్రాసిక్యూటర్ మేగన్ ఓ నీల్ మాట్లాడుతూ, వాడుకరులను వీలైనంత ఎక్కువ సేపు ప్లాట్‌ఫామ్‌పై ఉంచడం, వారి డేటాను సేకరించడం, ఆ తర్వాత నిజాలను ప్రజల నుంచి దాచడమే మెటా బిజినెస్ మోడల్ అని విమర్శించారు.
పిల్లల మెదడు పనితీరును అధ్యయనం చేసి, వారు నిరంతరం బహుమతులు లేదా లైక్‌లు కోరుకునే బలహీనతను, సామాజిక ప్రతిస్పందనలకు త్వరగా స్పందించే తత్వాన్ని, వారి ఆత్మనియంత్రణ లేమిని ఆసరాగా చేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో మార్పులు చేశారని తెలిపారు. చిన్న పిల్లలే అత్యుత్తమమైన వారు అనే పేరుతో మెటా చేసిన ఒక పరిశోధన నివేదికను కూడా కోర్టుకు సమర్పిస్తామని, మెటాకు పిల్లలే ఒక ప్రొడక్ట్ అని ఆమె పేర్కొన్నారు.
అంతేకాకుండా 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు నిబంధనలకు విరుద్ధంగా తమ యాప్‌లను వాడుతున్నారని తెలిసినా మెటా పట్టించుకోలేదని, ఒకవేళ ఫేస్బుక్ ఖాతాను మూసివేసినా దానికి లింక్ అయిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను మాత్రం అలాగే పనిచేయనిచ్చేదని ఉదాహరణగా చెప్పారు.
అయితే మెటా తరఫున వాదించిన లాయర్ పాల్ స్మిత్, కొందరు వినియోగదారులకు ప్లాట్‌ఫామ్‌పై చేదు అనుభవాలు ఎదురై ఉండవచ్చని అంగీకరిస్తూనే, వారి రక్షణ కోసం కంపెనీ అనేక సేఫ్టీ టూల్స్ తయారు చేసిందని చెప్పారు. తాము తల్లిదండ్రులు, నిపుణులు, చట్ట అమలు సంస్థలతో కలిసి పిల్లల భద్రత కోసం నిరంతరం పనిచేస్తున్నామని విచారణకు ముందే మెటా ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంకోవైపు విచారణ సందర్భంగా మెటా మాజీ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఆర్టురో బెజార్ కోర్టులో సాక్ష్యమిస్తూ, ఫేస్బుక్ ప్రారంభ రోజుల్లో భద్రత కంటే కూడా కొత్త ఫీచర్లను వేగంగా యూజర్లకు అందించడానికే ప్రాధాన్యం ఇచ్చేవారని, సెక్యూరిటీని తర్వాత చూసుకోవచ్చనే ధోరణి ఉండేదని వెల్లడించారు. ఈయన సాక్ష్యాన్ని అడ్డుకోవడానికి మెటా ప్రయత్నించినప్పటికీ కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.









