Hyderabad Metro Phase 2 : హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టును వీలయినంత తొందరగా పట్టాలెక్కించాలని ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన ఎన్‌సీఓలను వీలయినంత త్వరగా జారీ చేయాలని మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సంబంధిత అధికారులను కోరారు. దీనికోసం సచివాలయంలో కేంద్ర, రాష్ట్ర శాఖల అధికారులతో జయేష్ రంజన్ ఈ రోజు సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హెచ్ఎమ్ఆర్ఎల్ ఎండీ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా పాల్గొన్నారు.

కేంద్ర అనుమతుల కోసం డీపీఐఐటీ నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ ప్రక్రియలో భాగంగా ఈ సమావేశం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఫేజ్–2లో భాగంగా 7 కారిడార్ల ద్వారా మొత్తం 122.9 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన భూసేకరణ, రైల్వే క్రాసింగ్‌లు, మూసీ నది దాటే ప్రాంతాలు, గ్యాస్ పైప్‌లైన్లు, విమానాశ్రయ పరిధిలో నిర్మాణ అనుమతులపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రతిపాదిత కారిడార్లకు అన్ని శాఖలు త్వరితగతిన ఎన్‌సీఓలు జారీ చేయాలని సర్ఫరాజ్ అహ్మద్ ఆయా శాఖల అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఫేజ్–2 పనులు ముందుకు సాగితే హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత విస్తరించి, నగరంలో ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.