CM Revanth Reddy :  పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకు, తమ రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను ప్రజలు బేరీజు వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గతంలో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ప్రయోజనాలను అదనంగా పేదలకు అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో క్యూర్‌ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో మాట్లాడిన ఆయన పేదల రుణం తీర్చుకునే అవకాశం తనకు వచ్చిందని, ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో బీఆర్‌ఎస్ నాయకులపై సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఎండిపోవాలని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కొందరు చేతబడులు చేయించడానికి కర్ణాటకకు కూడా వెళ్లారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా కేసీఆర్ పరిస్థితి తయారైంది. అందుకే ఆయన అల్లుడు క్షుద్రపూజలు చేయిస్తున్నారు. కానీ మీరు చేయించే చేతబడులు మీకే తిరగబడి మిమ్మల్ని అష్టదిగ్బంధనం చేస్తాయి. చివరకు ఫామ్‌హౌస్ నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి వస్తుంది అని ఎద్దేవా చేశారు.

తన సంకల్పం రాష్ట్ర ప్రజల బాగు కోసమని, అందుకే దేవుడి దయ వల్ల సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయని రేవంత్ అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన నాయకులు ఇలా చేతబడులు, క్షుద్రపూజలు చేయించడం ఏంటని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్లీలు, బఠానీల లాగా అమ్మేశారు

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గ్రూప్-1 నియామకాలను పట్టించుకోలేదని, ఒకసారి పరీక్ష పెట్టినా ప్రశ్నపత్రాలను పల్లీలు, బఠానీల లాగా అమ్మేశారని విమర్శించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అర్హత లేని ఆర్‌ఎంపీ వైద్యుడిని సభ్యుడిగా చేశారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే TGPSC ని ప్రక్షాళన చేసి, విద్యావంతులను నియమించామని చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయించాలని సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, తాము మంచి లాయర్లను పెట్టి పోరాడి ఉద్యోగాల నియామకాలు పూర్తి చేశామని స్పష్టం చేశారు. అలాగే గ్రూప్-2, 3, 4 పోస్టులను కూడా కోర్టు సమస్యలను దాటుకుని భర్తీ చేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.