Rains
Rains

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని వాతావరణ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉండనుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.