Abhijit Dipke : నీట్‌ అవకతవకలు, పేపర్‌ లీక్‌ విషయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ రోజు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే మరోసారి సంచలన ప్రకటన చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా త్వరలోనే ‘జంతర్ మంతర్ సీజన్-2’ పేరిట సరికొత్త పోరాటాన్ని మొదలుపెట్టనున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో యూజర్లు అడుగుతున్న ప్రశ్నలకు స్పందించిన అభిజీత్ దిప్కే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా దీప్కే మాట్లాడుతూ.. జంతర్ మంతర్ సీజన్ 2 ఎప్పుడు ప్రారంభమవుతుందని చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్లు చేస్తున్నారని వెల్లడించారు. వారందరికీ నేను చెప్పేది ఒక్కటే.. అతి త్వరలోనే సీజన్ 2 ప్రారంభం కాబోతోందని తేల్చి చెప్పారు. అయితే, రెండో విడత నిరసనల తేదీలు, ప్రధాన డిమాండ్లు, పూర్తి ప్రణాళికలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా కలెక్టరేట్ వద్ద తమ పాఠశాలకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ దాదాపు 300 మంది విద్యార్థులు, 100 మంది తల్లిదండ్రులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి ఆందోళనకు మద్దతు ఇచ్చిన అభిజీత్ దిప్కే దశాబ్దాల క్రితమే పరిష్కారమవ్వాల్సిన కనీస మౌలిక వసతుల కోసం నేడు చిన్నారులు రోడ్డెక్కాల్సి రావడం బాధాకరమని వాపోయారు. అంతేకాక, దేశంలోని ప్రభుత్వ పాఠశాలల తీరుపై త్వరలోనే ఆందోళన ప్రారంభిస్తామని కూడా వెల్లడించారు.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో తమ పార్టీ వాలంటీర్ల సమావేశాన్ని అడ్డుకోవడానికి అధికార భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసిందని అభిజీత్ దిప్కే తీవ్రంగా ఆరోపించారు. సమావేశం కోసం హాల్స్ బుక్ చేసుకోకుండా హాల్ యజమానులపై పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. చివరికి ఒక హాల్ ఇవ్వడానికి కొంతమంది ముందుకు వస్తే సమావేశం జరిగే రోజు ఉదయం హాల్ నిర్వాహకులకు బెదిరింపులు వచ్చాయని స్పష్టం చేశారు. దేశంలోని యువతను చూసి అధికార బీజేపీ భయపడుతోందన్న దీప్కే, ఇలాంటి బెదిరింపులకు తమ పార్టీ లొంగబోదని తేల్చి చెప్పారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.