
Shakeel Noorani : బాలీవుడ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు షకీల్ నూరానీపై అత్యాచార ఆరోపణాలు వెల్లువెత్తాయి. ఆయనపై 33 ఏళ్ల నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 73 ఏళ్ల వయసున్న నూరానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై BNS యాక్ట్ కింద లైంగిక దాడి, బెదిరింపులకు సంబంధించిన పలు కఠినమైన సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సదరు నటికి 2016లో లోఖండ్వాలాలో జరిగిన ఓ అవార్డుల వేడుకలో షకీల్ నూరానీ పరిచయమయ్యారు. ఒక కొత్త సినిమా గురించి మాట్లాడిన ఆయన, అవకాశాల కోసం తనను కలవాలని ఆమెకు సూచించారు. దాంతో కథా చర్చల కోసం ఆమె మాల్వానీలోని ఆయన ఇంటికి వెళ్లగా, నూరానీ ఆమెకు తాగడానికి ఒక డ్రింక్ ఇచ్చారని, అది తాగాక తాను స్పృహ తప్పిపోయానని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
ఆ తర్వాత తనకు స్పృహ వచ్చాక, తన ఫోన్లో ఒక వీడియోను చూపించి, పోలీసులకుగానీ, కుటుంబ సభ్యులకుగానీ ఈ విషయం చెబితే వీడియోను బయట పెడతానని నూరానీ తీవ్రంగా బెదిరించినట్లు ఆ నటి ఆరోపించింది. ఆ వీడియో ఆధారంగానే తనను బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, ప్రతిసారీ తన చేత గర్భనిరోధక మాత్రలు కూడా మింగించేవాడని నటి సంచలన నిజాలు బయటపెట్టింది.
అయితే ఈ ఆరోపణలను నూరానీ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ గోయార్ తీవ్రంగా ఖండించారు. తన క్లయింట్‌ను కావాలనే ఈ కేసులో ఇరికించారని, ఇవన్నీ నిరూపించబడని ఆరోపణలని, విచారణ పూర్తయ్యే వరకు నూరానీ నిర్దోషియేనని తెలిపారు. కాగా, అరెస్ట్ అనంతరం పోలీసులు ఆయనను బోరివలి కోర్టులో హాజరుపరచగా, ఆ వీడియోకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు, విచారణ నిమిత్తం కోర్టు నూరానీకి ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీ విధించింది. షకీల్ నూరానీ గతంలో గోవిందా, ట్వింకిల్ ఖన్నాలతో జోరు కా గులామ్,బడే దిల్ వాలా వంటి ఎన్నో ప్రముఖ చిత్రాలకు దర్శకత్వం వహించారు.









