బండి భగీరథ్(Bandi Bageerath) పై పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో నమోదైన పోక్సో (POCSO) కేసు(bandi baghirath pocso case) లో ఆయనకు తెలంగాణ హైకోర్టులో ఎలాంటి తాత్కాలిక ఉపశమనం లభించలేదు. ఈ దశలో ముందస్తు బెయిల్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు(Bandi Bhageerath In High Court) తేల్చి చెప్పింది. ఈలోపు అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది పదే పదే చేసిన అభ్యర్థనలను న్యాయమూర్తి నిరాకరించారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు సుదీర్ఘ విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం.. బాలిక వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాతే మధ్యంతర ఉత్తర్వులపై వచ్చే వారం నిర్ణయాన్ని వెలువరిస్తామని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేశారు.
ఫిర్యాదులో పొంతన లేదు.. అంతా ఇష్టపూర్వకమే అన్న బండి భగీరథ్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపిస్తూ.. పోలీసులు రాజకీయ ఉద్దేశాలతో, పిటిషనర్‌ను ఇరికించాలనే కఠిన సెక్షన్లను చేర్చారని ఆరోపించారు. కేసు నమోదులో జరిగిన ఆలస్యాన్ని, బాధితురాలి ప్రవర్తనను, కాల్ రికార్డులను ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డిసెంబరులో సంఘటన జరిగితే, ఫిర్యాదుదారు న్యాయపరమైన చర్చలు జరిపిన తర్వాత మే 8న (దాదాపు నాలుగున్నర నెలల తర్వాత) ఫిర్యాదు చేశారు. నిజంగా అంత మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. వారిద్దరూ తల్లిదండ్రుల అనుమతితోనే బయటకు వెళ్లారని, ఇష్టపూర్వక రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలిపారు. జనవరి 7న ఈ బంధం నుంచి పిటిషనర్ బయటకు రావడంతోనే కేసులు తెరపైకి తెచ్చారన్నారు.
Also Read : బండి సంజయ్ తల్లికి గుండెపోటు: ఆసుపత్రికి తరలింపు
Bandi Bhagirath POCSO Case
డిసెంబర్ 31న రెండు రోజుల పాటు ఫామ్‌హౌస్‌లో ఉంచి, బలవంతంగా మద్యం తాగించారన్న ఆరోపణలు అబద్ధమని వాదించారు. అక్కడ స్నేహితులు తీసిన ఫోటోలు, వీడియోలు చూస్తే బాలిక స్వచ్ఛందంగానే ఆల్కహాల్ తీసుకున్నట్లు స్పష్టమవుతోందని, ఆ ఆధారాలను కోర్టు(telangana-high-court) కు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.2025 అక్టోబర్ 25న శారీరక వేధింపులు జరిగాయని ఫిర్యాదులో పేర్కొనగా.. ఆ మరుసటి రోజే బాధితురాలు స్వయంగా నిందితుడిని సినిమాకు ఆహ్వానిస్తూ టికెట్లు పంపిందని కోర్టుకు తెలిపారు. నవంబర్ 12, 13, 14 తేదీల్లో వారిద్దరూ ఎనిమిది గంటలకు పైగా ఫోన్‌లో మాట్లాడుకున్నారని, గంటల తరబడి చాటింగ్ కూడా సాగిందని వివరించారు. నిజంగా వేధింపులు జరిగితే ఇంత సన్నిహితంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. బాధితురాలి పుట్టిన తేదీలను రెండుగా చూపుతూ దానికి సంబంధించిన పత్రాలను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. ఆరోపణలపై అనుమానాలు ఉన్నప్పుడు బెయిల్ మంజూరు చేయవచ్చనే పలు కోర్టు తీర్పులను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ప్రభుత్వ పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) పల్లె నాగేశ్వరరావు పిటిషనర్ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. మొదటి ఫిర్యాదులోనే నిందితుడు బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఈ కేసులోని ఆరోపణలకు పోక్సో చట్టంలోని సెక్షన్ 5, 6 వర్తిస్తాయని, బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాతే పోలీసులు అదనపు సెక్షన్లు చేర్చారని స్పష్టం చేశారు. పోక్సో కేసు నమోదైనందున నిందితుడు ముందస్తు బెయిలుకు అనర్హుడని వాదించారు. బాలిక పదో తరగతి సర్టిఫికెట్లు, జీహెచ్‌ఎంసీ రికార్డులు, ఆమె జన్మించిన ఫెర్నాండెజ్ ఆస్పత్రి ధ్రువీకరణ పత్రాలను పోలీసులు సేకరించారని పీపీ తెలిపారు. దర్యాప్తు ప్రకారం బాధితురాలి వాస్తవ జనన తేదీ 2008 ఆగస్టు 12 అని, ఘటన సమయానికి ఆమె వయస్సు 18 ఏళ్ల లోపే (మైనర్) ఉందని ఆధారాలతో సహా కోర్టు దృష్టికి తెచ్చారు.
బాధితురాలి తరఫు సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు వాదిస్తూ.. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో బాధితులను తీవ్రంగా భయపెట్టారని ఆరోపించారు. “నా కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టను, నా కోసం చాలా మంది చనిపోయారు” అంటూ నిందితుడి తండ్రి బెదిరింపులకు పాల్పడటంతో బాధితులు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారన్నారు. నిందితుడు పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పెట్టాడని.. ప్రస్తుతం ఈ బాధితురాలే కాకుండా ఇలాంటి వారు మరో నలుగురు ఉన్నారని, వారు కూడా త్వరలోనే బయటకు వస్తారని పేర్కొంటూ ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వవద్దని కోరారు.
ఈ కేసు విచారణ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలపై జస్టిస్ టి.మాధవీదేవి తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. “నాపై జరుగుతున్న దుష్ప్రచారం నన్ను ఎంతగానో బాధిస్తోంది. కొంతమంది నన్ను ప్రభావితం చేస్తున్నారని, ఆశచూపుతున్నారనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. బాధితురాలి తరఫు న్యాయవాదికి తనపై ఏమాత్రం అభ్యంతరం ఉన్నా ఈ కేసు విచారణ నుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు. అయితే, బాధితురాలి న్యాయవాది తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో విచారణ కొనసాగించారు. ఈ దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్‌కు సూచించామని పీపీ తెలపగా.. అటువంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశించారు.చివరగా, వచ్చే వారం దాకా ఆగకుండా వీలైనంత త్వరగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ న్యాయవాది అభ్యర్థనను పరిశీలిస్తామని పేర్కొంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు.
Also Read : మనోవేదన అనుభవిస్తున్నాం…మమ్మల్ని వేదనకు గురి చేయొద్దు…బండి భగీరథ్ కేసులో బాలిక తల్లి







