
Yellow Alert : తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయి. రుతుపవనాలు ఎంతో చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మంగళవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ నగరానికి ‘ఎల్లో అలర్ట్’ (Yellow Alert) జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం రోజంతా మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
గత కొద్దిరోజులుగా ఏర్పడుతున్న వాతావరణ మార్పులు, ముఖ్యంగా క్యూములోనింబస్ (Cumulonimbus) మేఘాల తీవ్ర ప్రభావంతో సోమవారం రాత్రి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు భాగ్యనగరంలో భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షానికి అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో ఏకంగా 18.2 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. అలాగే వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదైనట్లు ప్రణాళికా సంఘం, వాతావరణ శాఖ అధికారులు ధ్రువీకరించారు.
ఎగువ ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాల కారణంగా మెదక్ – కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న చారిత్రాత్మక పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం రాత్రి నాటికి ప్రాజెక్టు పూర్తి నీటిమట్టానికి చేరుకుని నిండి పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు మత్తడి వద్ద నీరు ఉద్ధృతంగా దిగువకు ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రాజెక్టు వైపు వెళ్లే రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి సందర్శకులను, వాహనాలను నిలిపివేశారు.
Also Read : హైదరాబాద్ వాసులకు రెయిన్ అలర్ట్…ఈ రోజు సాయంత్రం భారీ వర్షం
హైదరాబాద్ నగర పరిధిలో కురిసిన భారీ వర్షం కారణంగా మూసీ నది తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. నగరంలోని డ్రైనేజీలు, చెరువుల నుంచి మురుగు, వరద నీరు భారీగా చేరడంతో మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ వరద ధాటికి యాదాద్రి భువనగరి జిల్లా సంగెం సమీపంలోని ‘భీమలింగం’ వద్ద ఉన్న లోలెవల్ వంతెన పైనుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనివల్ల సంగెం, దాని పరిసర గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి కురిసిన హఠాత్ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. అమీర్‌పేట్, పంజాగుట్ట, ఐటీ కారిడార్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్ వంటి పలు కీలక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. జీహెచ్ఎంసీ (GHMC) డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై నిలిచిన నీటిని తోడిపోస్తూ, విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగించే చర్యలు చేపట్టాయి.
రాష్ట్రంలో నెలకొన్న ఈ అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం,విపత్తు నిర్వహణ శాఖలు పూర్తిస్థాయిలో అలర్ట్ అయ్యాయి. కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు తమ జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, విద్యుత్ స్తంభాలు, పొంగిపొర్లుతున్న వాగులు ,కల్వర్టుల వద్దకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. నగర ప్రజల సహాయం కోసం జిహెచ్ఎంసి ప్రత్యేక కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.
Also Read : తోటి టీచర్ల కుట్రలకు బలయ్యా… ఖమ్మం టీచర్ గౌతమి రిజైన్!









