
Faridabad : పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిని హతమార్చిన ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో వెలుగు చూసింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు 33 ఏళ్ల మహిళ తన ప్రియుడైన హౌస్ పెయింటర్‌ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితురాలిని అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా సత్నా గ్రామానికి చెందిన అనిత అనే మహిళ ఫరీదాబాద్‌లోని అనంగ్‌పూర్ గ్రామంలో అద్దె గదిలో ఉంటోంది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సదాకత్ అనే వ్యక్తిని ఆమె హత్య చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లా రాంపూర్ షాపూర్‌కు చెందిన సదాకత్, అనిత ఇద్దరూ ఫరీదాబాద్‌లోని ఒక గేటెడ్ రెసిడెన్షియల్ సొసైటీలో పని చేసేవారు. సదాకత్ హౌస్ పెయింటర్‌గా, అనిత క్లీనర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ అంతకుముందే వివాహాలు కాగా, అనితను ఆమె భర్త వదిలేశాడు.
కొంతకాలంగా ఇద్దరూ కలిసి ఉంటుండగా, వారి సంబంధం గురించి తెలుసుకున్న ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమన్నాడు. దీంతో సుమారు 15 రోజుల క్రితం అనిత అనంగ్‌పూర్ గ్రామంలోని దొమ్కా మొహల్లాలో వేరే గదిని అద్దెకు తీసుకుంది. అక్కడికి సదాకత్ తరచూ వెళ్తుండేవాడు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని అనిత కోరగా, సదాకత్ మాత్రం వాయిదా వేస్తూ వచ్చాడు.
ఈ విషయమై జూలై 25న సదాకత్‌ను తన గదికి రప్పించిన అనిత అతనికి మద్యం తాగించింది. ఆ తర్వాత రాత్రి అతను మత్తులో గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత కత్తితో గొంతు కోసి హత్య చేసింది. అనంతరం గదికి బయటి నుంచి తాళం వేసి అక్కడి నుంచి పరారైంది.
మృతుడి సోదరుడు నజాకత్ అలీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. జూలై 23న అలీగఢ్ వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన సదాకత్ తిరిగి రాలేదని, ఫోన్ కూడా పనిచేయలేదని తెలిపారు. అనితను సంప్రదించగా సదాకత్ తన వద్దకు రాలేదని ఆమె అబద్ధం చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంగ్‌పూర్‌లోని ఒక ఇంట్లో శవం పడి ఉందని గురువారం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న సదాకత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నజాకత్ ఫిర్యాదు ఆధారంగా సూరజ్‌కుండ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, శుక్రవారం రాత్రి నిందితురాలు అనితను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఆమెను సిటీ కోర్టులో హాజరుపరచగా రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.









