Karimnagar Robbery: కరీంనగర్‌లోని ప్రముఖ పీఎంజే (PMJ) జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును ఛేదించడంలో పోలీసులు సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర ముఠా వ్యవహారం, జైలు నుండి సూత్రధారి ప్లాన్, దొంగలకు జీతాలు, ఇన్సెంటీవ్‌లు ఇవ్వడం వంటి విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ పీఎంజే (PMJ) జ్యువెలరీ షాపులో మే 3న తుపాకులతో బెదిరించి భారీ దోపిడీకి పాల్పడిన కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. ఈ దారుణ ఘటనపై పోలీసుల దర్యాప్తులో అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాకు చెందిన ముగ్గురు కీలక సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ అభిషేక్ గౌస్ ఆలం వెల్లడించారు. ఈ భారీ దోపిడీ వెనుక బీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్, ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరుగాంచిన సుబోధ్ సింగ్ హస్తం ఉందని, జైలు నుంచే అతను ఈ పథకాన్ని రూపొందించాడని దర్యాప్తులో తేలిందని సీపీ వివరించారు. దొంతతనం చేయడానికి అతను జైలు నుంచే తనకు అవసరమైన గ్యాంగ్‌ను ఎంచుకుంటాడని ఆయన వివరించారు.
దొంగలకు జీతాలు, ఇన్సెంటీవ్‌లు
దోపిడీ ముఠా వ్యవహారశైలి అత్యంత రహస్యంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ గ్యాంగ్ నాయకుడు సుబోధ్ సింగ్ జైలు నుండే తన ప్లాన్‌ను అమలు చేస్తాడు. అందుకోసం ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులను ఎంచుకుంటాడు. మరికొంతమందిని ఆన్‌లైన్ ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. అలాగే వారి పేర్లను మార్చి వారికి నకీలి ఆధార్ కార్డులు సృష్టించి ఇస్తారు. అనంతరం వారు దొంగతనం చేయాలనుకున్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు. కాగాఈ దొంగలకు దొంగతనం చేయడానికి జీతాలు కూడా ఇస్తాడు. అలాగే దొంగతనం విజయవంతం అయితే దోచుకున్న సొమ్ములో నుంచి 15 శాతం ఇన్సెంటీవ్ కూడా ఇస్తాడనే విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.ఈ గ్యాంగ్ దోపిడీకి రెండు నెలల ముందే తెలంగాణకు చేరుకుని ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్ వంటి పట్టణాల్లో క్షుణ్ణంగా రెక్కీ నిర్వహించారు. పోలీసులకు చిక్కకుండా నకిలీ బైక్ నంబర్ ప్లేట్లు, నకిలీ గుర్తింపు కార్డులను వాడినట్లు దర్యాప్తులో తేలింది. అలాగే వీరు ఎక్కడైతే సెల్టర తీసుకుంటారో అక్కడి స్థానికులతో ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం తీసుకోరని పోలీస్ కమిషనర్ అభిషేక్ గౌస్ ఆలం వివరించారు. వీరంతా ధర్మపురిలో ఆశ్రయం తీసుకుని అక్కడి నుంచి కరీంనగర్ వచ్చి నగల షాపులో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
అనంతరం మే 3న కస్టమర్లుగా వచ్చిన దుండగులు, నలుగురు షాపు సిబ్బందిని తుపాకులతో బెదిరించి, ఎదురుతిరిగిన వారిపై కాల్పులు జరిపారు. సుమారు రూ. 82.02 లక్షల విలువైన 161.4 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాలను దోచుకెళ్లారు. దోపిడీ తర్వాత పోలీసులు జగిత్యాల జిల్లా మద్దునూరు వద్ద దొంగలు పగలగొట్టిన సెల్‌ఫోన్‌ను గుర్తించారు. ఆ ఫోన్ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేసి బిహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం పోలీసుల వద్ద పట్టుబడిన నిందితుల నుండి రూ. 51 వేల నగదు, 2 మొబైల్ ఫోన్లు, రెండు సిమ్ కార్డులు , నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. చోరీలో మొత్తం 13 మంది నిందితులు పాల్గొనగా, ఇప్పటి వరకు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిని రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీర్ సింగ్, రవీష్ కుమార్, మెహతాబ్ ఖాన్‌లుగా గుర్తించారు. పరారీలో ఉన్న మిగిలిన 10 మంది నిందితులను పట్టుకోవడానికి, చోరీకి గురైన ఆభరణాలను రికవరీ చేయడానికి ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సీపీ తెలిపారు. ఈ గ్యాంగ్‌పై పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. బీహార్, పశ్చిమ బెంగాల్ ఝార్ఖండ్ రాష్ట్రాల్లో సుబోధ్ సింగ్ ముఠా చోరీలకు పాల్పడిందన్నారు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసులను సీపీ అభినందించారు.
త్వరలోనే పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్‌తో పాటు మిగిలిన నిందితులను పట్టుకుని ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని సీపీ గౌష్ అలం హామీ ఇచ్చారు. వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇలాంటి దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో జరగడం ఇదే మొదటిసారని ఆయన తెలిపారు. నిందితుల కోసం బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.







