
NEET Leak : నీట్ (NEET), జేఈఈ (JEE Main) వంటి జాతీయ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. పరీక్షల నిర్వహణ ఏజెన్సీ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో ప్రక్షాళన చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం, ఈ వివాదాలతో ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన 47 మంది అధికారులను సర్వీస్ నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వీరిలో కొందరిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్, లీగల్ విచారణలు కూడా ఎదురుకానున్నాయని అధికార వర్గాలు ధ్రువీకరించాయి.
ఎన్టీఏ పనితీరును సమూలంగా మార్చేందుకు, ముఖ్యంగా వివాదాలకు తావిస్తున్న ఔట్సోర్సింగ్ విధానంలో పారదర్శకమైన మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాబోయే రోజుల్లో పేపర్ లీకులకు ఏమాత్రం అవకాశం లేకుండా నిపుణుల కమిటీ సూచనల మేరకు సాంకేతికత, భద్రతా ప్రమాణాలను పెంచనుంది. ఇందులో భాగంగా సైబర్ సెక్యూరిటీ, క్వశ్చన్ బ్యాంక్ భద్రత, టెస్ట్ సెంటర్ నిర్వహణల కోసం ప్రత్యేక విభాగాలు, నిపుణులతో కూడిన నాయకత్వాన్ని ఎన్టీఏలో ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు, పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్-2024 చట్టానికి మరింత పదను పెడుతూ కీలక సవరణల ముసాయిదా బిల్లుకు శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. కొత్త నిబంధనల ప్రకారం, పరీక్షల నిర్వహణలో మోసాలకు పాల్పడే ముఠాలు, లీకేజీలకు కారకులయ్యే సంస్థలపై 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు గరిష్టంగా ₹10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఈ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయనున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం పారదర్శకమైన వ్యవస్థను రూపొందించే లక్ష్యంతో 2017లో ఎన్టీఏను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా కేంద్రం ఏర్పాటు చేసింది. అయితే ఇటీవలి వరుస పేపర్ లీక్‌లతో విద్యార్థులు, యువత నుంచి వెల్లువెత్తిన నిరసనలకు స్పందిస్తూ.. పరీక్షల వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు కేంద్రం ఈ ప్రక్షాళన చర్యలను ఒక యజ్ఞంలా ప్రారంభించింది.









