రష్యాపై మరోసారి ఉక్రెయిన్ విరుచుకుపడింది. రష్యాలోని సమర రీజియన్‌లో ఉన్న ప్రముఖ ‘సిజ్రాన్’ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్లతో మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల కారణంగా ఆయిల్ రిఫైనరీకి భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది.

ఈ సిజ్రాన్ రిఫైనరీ రష్యాకు అత్యంత కీలకమైనది. దీనిని రష్యాకు చెందిన ప్రముఖ ‘రోస్‌నెఫ్ట్’ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఈ కర్మాగారానికి ఏడాదికి దాదాపు 8.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురును ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉంది. ఇక్కడి నుంచే సమర ప్రాంతానికి అవసరమైన పెట్రోల్, డీజిల్, విమానాల్లో వాడే ఏవియేషన్ ఫ్యూయల్ సరఫరా అవుతాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా సైనిక దళాల వాహనాలకు, యుద్ధ విమానాలకు అవసరమైన ఇంధనాన్ని ఇక్కడి నుంచే ఎక్కువగా పంపిస్తుంటారు. అయితే తాజా డ్రోన్ దాడితో ఈ రిఫైనరీలో చమురు ఉత్పత్తి, కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో కూడా ఉక్రెయిన్ ఈ రిఫైనరీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.

ఉక్రెయిన్ కేవలం చమురు కర్మాగారాలపైనే కాకుండా రష్యాకు చెందిన రవాణా వ్యవస్థలపైనా విరుచుకుపడింది. అజోవ్ సముద్రంలో ప్రయాణిస్తున్న రష్యాకు చెందిన 10 చమురు ట్యాంకర్లను, 4 పెద్ద ఫెర్రీలను ఉక్రెయిన్ దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. అంతర్జాతీయంగా రష్యాపై ఉన్న ఆంక్షలను తప్పించుకుంటూ, దొంగచాటుగా చమురును విక్రయించడానికి రష్యా ఈ ట్యాంకర్లను వాడుతోంది. అలాగే ధ్వంసమైన ఫెర్రీలను రష్యా సైన్యానికి అవసరమైన ఆయుధాలు, కార్గో, లాజిస్టిక్స్ సామాగ్రిని చేరవేర్చడానికి ఉపయోగిస్తున్నారు.