
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ త్వరలోనే బహిరంగంగా ప్రజల ముందుకు రానున్నారు. ఈ నెల 23వ తేదీన ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్మారక సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు మొజ్తబా ఖమేనీ స్వయంగా నేతృత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. జులై 23 సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల మధ్య ఈ కార్యక్రమం జరగనుంది. ఈ స్మారక సభకు ఇరాన్ దేశంలోని కీలక రాజకీయ నాయకులు, సైనిక అధికారులు, ప్రముఖ నేతలందరూ హాజరుకానున్నారు.
మొజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజల ముందుకు రాలేదు. తీవ్రమైన భద్రతా కారణాల దృష్ట్యా ఆయన చాలా రహస్య ప్రదేశంలో ఉంటున్నారు. ఇటీవల జరిగిన ఖమేనీ అంత్యక్రియలకు కూడా భద్రతా కారణాల వల్లే దూరంగా ఉండాల్సి వచ్చింది. అంతేకాదు రెండు వారాల కిందట మొజ్తబా భార్య మరణించగా.. ఆమె అంత్యక్రియల్లో సైతం ఆయన ఎక్కడా కనిపించలేదు.
మొజ్తబా ఖమేనీ ఇలా బయటకు రాకపోవడానికి భద్రతతో పాటు ఆరోగ్య కారణాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌లోని ఖమేనీ కాంపౌండ్‌పై జరిగిన భారీ దాడుల్లో ఆయన కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. మొజ్తబాకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఆ దాడుల్లో ఒక కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. అదే సమయంలో మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారని, నాటి నుండి ఆయన రహస్య ప్రదేశంలో ఉంటూ చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది.
ప్రజల ముందుకు రాకపోయినప్పటికీ మొజ్తబా ఖమేనీ సోషల్ మీడియా ద్వారా ఇరాన్ ప్రజలతో టచ్‌లోనే ఉన్నారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను ఆయన నిరంతరం ఖండిస్తూ వస్తున్నారు. ఇటీవల టెలిగ్రామ్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. తన తండ్రి అలీ ఖమేనీ మరణానికి కారణమైన వారిపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని, బాధ్యులైన దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.









