Novo Nordisk: డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ నోవో నార్డిస్క్ (Novo Nordisk) భారత్‌లో బాసల్ ఇన్సులిన్ విభాగంలో ఒక సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. రోజువారీ ఇన్సులిన్ షాట్లకు ప్రత్యామ్నాయంగా, వారానికి ఒక్కసారి మాత్రమే వేసుకునే బాసల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ ‘Awiqli’ (ఇన్సులిన్ ఐకోడెక్)ను గురువారం భారత మార్కెట్‌లోకి అధికారికంగా విడుదల చేసింది. క్లినికల్ వినియోగం కోసం ఆమోదం పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి వారాంతపు బాసల్ ఇన్సులిన్‌గా Awiqli గుర్తింపు పొందింది.

టైప్-1 , టైప్-2 మధుమేహంతో (డయాబెటిస్) బాధపడుతున్న పెద్దల చికిత్స కోసం ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారని కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు బాసల్ ఇన్సులిన్ తీసుకునే రోగులు ఏడాదికి 365 ఇంజెక్షన్లు వేసుకోవాల్సి రాగా, ఈ కొత్త ఔషధంతో ఆ సంఖ్య ఏకంగా 52 ఇంజెక్షన్లకు పడిపోతుంది. ఇది డయాబెటిస్ రోగులకు సూదుల నొప్పి నుంచి, రోజువారీ నిర్వహణ భారం నుంచి భారీ ఊరట నివ్వనుంది.

ధరల వివరాలు:
న్యూఢిల్లీలో జరిగిన లాంచ్ కార్యక్రమంలో నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియ మాట్లాడుతూ.. వారానికి ఇచ్చే 70 యూనిట్ల Awiqli ఇన్సులిన్ మోతాదు ధరను రూ. 261 ($2.74) గా నిర్ణయించినట్లు తెలిపారు. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది:

1 మి.లీ పెన్ (700 యూనిట్లు): రూ. 2,611

3 మి.లీ పెన్ (2,100 యూనిట్లు): రూ. 7,833

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రోజువారీ బాసల్ ఇన్సులిన్ ఉత్పత్తులలో 70 యూనిట్ల ధర రూ. 345 నుండి రూ. 453 వరకు ఉంటే, దానితో పోలిస్తే Awiqli ధర చాలా సరసమైనదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఔషధం వచ్చేవారం నుండి భారత మార్కెట్లలో వినియోగదారులకు లభించనుంది.

భారతదేశంలో ప్రస్తుతం 10.1 కోట్లకు పైగా ప్రజలు మధుమేహంతో జీవిస్తుండగా, మరొక 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారని నోవో నార్డిస్క్ తెలిపింది. సూదులంటే భయం, నొప్పి, ఖర్చుల పట్ల ఆందోళనల కారణంగా మనదేశంలో ఇన్సులిన్ చికిత్సను ప్రారంభించడం సగటున 7 నుండి 9 సంవత్సరాలు ఆలస్యమవుతోందని కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతం భారత్‌లో దాదాపు 60 లక్షల మంది ఇన్సులిన్ థెరపీని పొందుతుండగా, సమీప భవిష్యత్తులో ఈ సంఖ్య 90 లక్షలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. బిజీ జీవనశైలి, ఆహార అలవాట్లు మరియు జన్యుపరమైన కారణాల వల్ల భారత్‌లో ఇన్సులిన్ మార్కెట్ 2025లో 660.5 మిలియన్ డాలర్ల నుండి 2034 నాటికి 916.4 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఐఎంఏఆర్‌సి (IMARC) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Awiqli ఔషధం ఇప్పటికే యుఎస్, యూరోపియన్ యూనియన్ మరియు అనేక ఇతర దేశాల్లో ఆమోదం పొందింది. ఈ విప్లవాత్మక ఔషధాన్ని విడుదల చేసిన 7వ దేశంగా భారతదేశం నిలిచింది. భారత మార్కెట్‌లో సనోఫీ సంస్థకు చెందిన ల్యాంటస్ (Lantus) తో పాటు, దేశీయ రంగానికి చెందిన బయోకాన్, ఎరిస్ లైఫ్‌సైన్సెస్ మరియు లుపిన్ వంటి సంస్థల తక్కువ ధరల ఇన్సులిన్ గ్లార్జిన్ ఉత్పత్తులతో Awiqli పోటీపడనుంది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.