
DSP Bheem Reddy : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నమోదు చేసిన రిమాండ్ రిపోర్టుతో పాటు అంతర్గత విచారణలో అనేక విస్తుపోయే, సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భీంరెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో అధికారులు ఆయన్ను చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.
ఏసీబీ ప్రాథమిక అంచనాల ప్రకారం భీంరెడ్డి అక్రమాస్తుల ప్రభుత్వ విలువ రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఉన్నప్పటికీ, మార్కెట్ విలువ ప్రకారం ఇవి రూ.500 కోట్ల నుంచి రూ.1000 కోట్ల పైమాటేనని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు తెలంగాణ, కర్ణాటకలోని 15కి పైగా ప్రదేశాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరే స్థాయి ఆస్తుల పత్రాలు, నగదు, ఆభరణాలు లభ్యమయ్యాయి.
ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.3.60 లక్షల నగదుతో పాటు ఓ బినామీ ఇంట్లో మరో రూ.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బ్యాంకుల్లో ఉన్న రూ.19.91 లక్షల డిపాజిట్లను కూడా అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ప్రస్తుతం నివసిస్తున్న లగ్జరీ విల్లాను ఎలా కొనుగోలు చేశారో స్పష్టమైన వివరణ ఇవ్వడంలో భీంరెడ్డి విఫలమయ్యారని అధికారులు వెల్లడించారు.
చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికి డీఎస్పీ భీంరెడ్డి అత్యంత తెలివిగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టు పేర్కొంది. ముందుగా ఆస్తులను తన పేరిటే రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆ తర్వాత ‘క్యాన్సిలేషన్ డీడ్’ ద్వారా వాటిని రద్దు చేసేవాడు. అనంతరం ఆ స్థలాలను తన బినామీల పేరిట మార్చి, ముందస్తు జాగ్రత్తగా వారి వద్ద నుంచి క్యాన్సిలేషన్ పత్రాలను తన వద్దే ఉంచుకుని తెరవెనుక నుండి తానే సర్వహక్కులు అనుభవించేవాడని తేలింది.
సోదాల సందర్భంగా భీంరెడ్డి ఇంట్లో లభించిన రెండు కీలకమైన మెమరీ కార్డులు, వ్యక్తిగత డైరీలు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారాయి. ‘నాకు ఇవ్వాల్సిన వాళ్లు.. నేను ఇవ్వాల్సినవి’ అంటూ భీంరెడ్డి స్వయంగా డైరీలో రాసుకున్న లెక్కలు, కోడ్ లాంగ్వేజ్‌లో ఉన్న సమాచారం, వాట్సాప్ చాట్లు చూసి ఏసీబీ అధికారులు సైతం అవాక్కయ్యారు. బినామీలు ఎప్పుడైనా తిరగబడితే ఎలా ఎదుర్కోవాలో ముందే ఊహించి ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు లభించిన సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి.
1995లో ఎస్సైగా పోలీస్ శాఖలో చేరిన భీంరెడ్డి, తన 30 ఏళ్ల సర్వీసు కాలంలో ఎక్కడా లూప్‌లైన్ పోస్టింగ్‌లో లేకుండా జాగ్రత్తపడ్డారు. ఓ మాజీ ఐపీఎస్ ఉన్నతాధికారి అండదండలతో సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలోనే కీలకమైన (ఫోకల్) పోస్టింగ్‌లు పొందినట్లు సమాచారం. విధులు నిర్వర్తించిన ప్రతిచోటా రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి భూములు, ఫ్లాట్లను తన బంధువులు, స్నేహితుల పేరిట రాయించుకున్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
డీఎస్పీ భీంరెడ్డి కేవలం స్వయంకృషితోనే కాకుండా ఓ మాజీ ఐపీఎస్ ఉన్నతాధికారికి ప్రధాన బినామీగా వ్యవహరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఉన్నతాధికారి తన సర్వీసు కాలంలో అక్రమంగా సంపాదించిన సొమ్మును భీంరెడ్డి ద్వారానే వివిధ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా మళ్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి పనిలోనూ ఆ అధికారికి వాటా ఇస్తూ భీంరెడ్డి అతనికి శాశ్వత బినామీగా మారారని విచారణలో బయటపడింది.
ఈ అవినీతి నెట్‌వర్క్ ఒక్క పోలీస్ శాఖకే పరిమితం కాకుండా రాజకీయ, వ్యాపార వర్గాలకూ విస్తరించినట్లు విచారణలో వెల్లడవుతోంది. ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక యాజమాన్యంతో పాటు రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఒక డీసీపీ, ఒక జిల్లా ఎస్పీతో భీంరెడ్డికి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా, బీజేపీకి చెందిన ఒక సీనియర్ మహిళా నాయకురాలికి నమ్మకస్తుడిగా ఉంటూ, పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులతో వ్యాపార సంబంధాలు నెరిపినట్లు తెలుస్తోంది.
ఏసీబీ సోదాల్లో బయటపడిన 70కి పైగా ప్లాట్లు, ఫ్లాట్లు తెలంగాణ, కర్ణాటక వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. తెలంగాణలోని ఇబ్రహీంబాగ్‌లో వెస్సెల్లా మెకోస్‌లో లగ్జరీ విల్లా, తెల్లాపూర్, గచ్చిబౌలి, మణికొండ, మోమిన్‌పేట, పటాన్‌చెరు, ముచ్చింతల్‌లోని ఎకరాల కొద్దీ భూములతో పాటు జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అలాగే కర్ణాటకలోని బెంగళూరు దేవనహళ్లి, కలబురిగి (గుల్బర్గా) సమీపంలో 38 ఎకరాల భూమిని కూడా ఏసీబీ కనుగొంది.
కర్ణాటకలోని కలబురిగి సమీపంలో వెలుగుచూసిన 38 ఎకరాల విలువైన భూమి ఆ మాజీ ఐపీఎస్ అధికారిదేనని ఏసీబీ వర్గాలు తీవ్రంగా అనుమానిస్తున్నాయి. అలాగే, ప్రముఖ కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ప్రగతి రిసార్ట్స్ సమీపంలోని ప్లాట్లలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా, తన కొడుకు వివాహాన్ని వరంగల్‌కు చెందిన ఒక ప్రభావవంతమైన వ్యక్తి కుమార్తెతో నిశ్చయించేందుకు మాట్లాడినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఓ ప్రముఖ దేవాలయ బోర్డు చైర్మన్‌తోనూ భీంరెడ్డికి ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
ఈ కేసునుంచి తప్పించుకోవడానికి భీంరెడ్డి తనకున్న రాజకీయ, అధికారిక నెట్‌వర్క్ ద్వారా పెద్ద ఎత్తున పైరవీలు చేసినట్లు తెలిసింది. అయితే ప్రజల నుంచి, మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం, పక్కా ఆధారాలు లభించడంతో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేయక తప్పలేదు. ప్రస్తుతం 15 మందికి పైగా బినామీలను గుర్తించిన ఏసీబీ, ఆస్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతోంది.
స్వాధీనం చేసుకున్న మెమరీ కార్డులలోని డిజిటల్ డేటా, డైరీలలోని సమాచారాన్ని దర్యాప్తు బృందాలు విశ్లేషిస్తున్నాయి. భీంరెడ్డికి సహకరించిన ఇతర ప్రభుత్వ అధికారులు, బినామీలు, రాజకీయ నాయకుల అసలు ముసుగులు త్వరలోనే తొలగిపోనున్నాయి. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ తెలంగాణ పోలీస్, రాజకీయ వర్గాల్లో మరిన్ని సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.









