Pahalgam Attack : ప్రస్తుతం ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఇండోనేషియా అందించిన మద్దతును కొనియాడారు. గతేడాది జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడి సమయంలో ఇండోనేషి యా భారత్‌కు అత్యంత బలంగా అండగా నిలిచిందని మోదీ గుర్తుచేసుకున్నారు. ఉగ్రవాదాన్ని అంత మొందించే విషయంలో ఇరు దేశాలు ఒకే బాటలో పయనిస్తున్నాయని, జాయింట్ వర్కింగ్ గ్రూప్ (Joint Working Group) ద్వారా కౌంటర్ టెర్రరిజంపై కలిసికట్టుగా పనిచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

Also Read : స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్: రూ.8 లక్షల కోట్లు ఆవిరి.. ట్రంప్ ఒక్క ప్రకటనతో కుప్పకూలిన సూచీలు

పహల్గామ్ ఉగ్రదాడి – చారిత్రక పరిణామాలు

2025 ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు అత్యంత మూకమ్మడి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పర్యాటకుల మతాన్ని అడిగి తెలుసుకుని మరీ 26 మంది అమాయకులను కాల్చి చంపారు.ఈ ఘోరకలికి ప్రతికారంగా భారత సైన్యం 2025 మే 6-7 తేదీల మధ్య రాత్రి అత్యంత వ్యూహాత్మకంగా ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, లష్కరే తొయిబా సంస్థలకు చెందిన 9 ఉగ్రవాద శిబిరాలను భారత దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమవ్వడమే కాకుండా, జైషే అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు కూడా మరణించారు. ఆ తర్వాత మే 10 వరకు ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయి సైనిక ఘర్షణ జరగగా, చివరకు పాకిస్తాన్ సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ) కోరడంతో ఉద్రిక్తతలు సడలిపోయాయి.

ఇండోనేషియా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం (సుమారు 87% ముస్లింలు). అయినప్పటికీ, పహల్గామ్ దాడి జరిగిన వెంటనే ఎటువంటి సంకోచం లేకుండా ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన తొలి దేశాలలో ఇండోనేషియా ఒకటిగా నిలిచింది.: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ దాడిని ఖండిస్తూ.. “కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి ఇండోనేషియాలో ఆచరించే ఇస్లాం ధర్మానికి పూర్తిగా విరుద్ధం. మా వద్ద ఇస్లాం ఇలాంటి హింసను బోధించదు” అని స్పష్టం చేశారు. సైన్యం నీడలో నడిచే ఏ పాలనా వ్యవస్థ కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని, ఉగ్రవాదం వల్ల ఏ ప్రయోజనం ఉండదని ఆయన పాకిస్తాన్‌ను బహిరంగంగానే ఆడేసుకున్నారు.

భారత్‌లోని ఇండోనేషియా రాయబారి ఇనా హగ్నినింగ్త్యస్ కృష్ణమూర్తి ఈ దాడిని ‘హేయమైన నేరం’గా అభివర్ణించారు. ఎలాంటి నెపంతోనైనా, ఎక్కడైనా జరిగే ఇలాంటి అమానుష చర్యలను సమర్థించలేమని, బాధితులకు తమ పూర్తి సానుభూతి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఇండోనేషియా విదేశాంగ శాఖ ఈ దాడిని మానవ హక్కులు, శాంతి భద్రతల ఉల్లంఘనగా పేర్కొంటూ ఖండించింది.ఇండోనేషియా చూపిన ఈ వైఖరి అంతర్జాతీయంగా భారత్ దౌత్యానికి తీవ్ర బలాన్నిచ్చింది. ముస్లిం మెజారిటీ దేశమై ఉండి కూడా మతానికి అతీతంగా ఉగ్రవాదాన్ని ఖండించడాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో కూడా భాగస్వామ్యం ఊపందుకుంటోంది. భారత్ నుంచి బ్రహ్మోస్ (Brahmos) క్షిపణులను కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ఒప్పందం కుదుర్చుకోవడమే కాకుండా, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత వైమానిక దళం ఉపయోగించిన ‘అస్త్ర’ (Astra) క్షిపణులను కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ పరిణామాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ – ఇండోనేషియాల వ్యూహాత్మక, భద్రతా సంబంధాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి.

Also Read : ఇండోనేషియా పర్యటనలో మోదీ.. టెంపుల్ కు తీసుకెళ్లిన అ దేశ అధ్యక్షుడు

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.