చైనాలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. చైనా వ్యాప్తంగా దాదాపు 62 నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వరదలు, కొండచరియలు విరిగిపడిన వేర్వేరు ఘటనల్లో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 331 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Also Read : పిల్లల ప్రాణాలతో మెటా చెలగాటం.. కోర్టు సంచలన తీర్పు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై రూ.120 లక్షల కోట్ల ఫైన్?

వరదలతో పాటు మరో ముప్పు

చైనా ప్రజలను కేవలం వరద నీరు మాత్రమే కాదు.. అంతకంటే భయంకరమైన మరో సమస్య ఇప్పుడు వెంటాడుతోంది. హెంగ్ఝౌ ప్రాంతంలో వరద బీభత్సం కారణంగా ఒక భారీ పాముల ఫారమ్ పూర్తిగా కూలిపోయింది. దీంతో ఆ ఫారమ్‌లో పెంచుతున్న దాదాపు 900 పాములు ఒక్కసారిగా బయటకు వచ్చి వరద నీటిలో కొట్టుకుపోయాయి. ప్రస్తుతం ఆ పాములన్నీ వరద నీటితో పాటు స్థానిక నివాస ప్రాంతాల్లోకి, ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ పాము వచ్చి కాటేస్తుందోనని స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య వణికిపోతున్నారు.

ఈ ఘటనపై చైనా ప్రభుత్వ అధికారులు స్పందించారు. ఫారమ్ నుంచి తప్పించుకున్న 900 పాములలో చాలా వరకు విషపూరితం కానివని, ప్రజలు ఆందోళన చెందక్కర్లేదని అన్నారు. అయితే ఏది విషమున్న పామో, ఏది విషం లేని పామో సాధారణ ప్రజలు గుర్తించడం కష్టం. కాబట్టి.. వరద నీటిలో కొట్టుకువచ్చే పాములను ఎవరూ సొంతంగా చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించవద్దని హెచ్చరించారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

Also Read : భారత్-ఇండోనేషియా బిగ్ డీల్స్.. డెఫెన్స్ నుంచి టెక్నాలజీ వరకు కుదుర్చుకున్న ఒప్పందాలివే!