sanju

IND vs ZIM :  జింబాబ్వేతో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 15 మందితో కూడిన బలమైన జట్టును సోమవారం ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో పలు ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించగా, పంజాబ్ కింగ్స్ యువ హిట్టర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది.

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ స్థానంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మతో కలిసి సూర్యవంశీ టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. జట్టులో ప్రధాన వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టనుండగా, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ బ్యాకప్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.

ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసిన యశ్ ఠాకూర్, అశోక్ శర్మలకు కూడా తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. అదేవిధంగా, విధ్వంసకర ఫినిషర్ రింకూ సింగ్ తిరిగి జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ వ్యవహరించనున్నారు. జూలై 23, 25, 26 తేదీలలో జింబాబ్వే రాజధాని హరారే వేదికగా ఈ మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత జట్టు ఇదే:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.