UAPA:సీమాంతర ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది. పాకిస్థాన్ కేంద్రంగా భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న శక్తులపై తీవ్రమైన చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా పాక్ లష్కరే తయ్యిబా (LeT), జైషే మహమ్మద్ (JeM) వంటి నిషేధిత ఉగ్రసంస్థల అనుబంధ విభాగాలకు చెందిన 23 మంది కీలక ఆపరేటివ్స్‌ను కేంద్రం తాజాగా ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం (జులై 4) ఒక అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద వీరిని ఉగ్రవాదులుగా పరిగణిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ఈ 23 మంది ఆపరేటివ్స్ జమ్మూకశ్మీర్‌లో భారీ దాడులకు కుట్రలు పన్నడం, అంతర్జాతీయ సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా అధునాతన ఆయుధాలను సరఫరా చేయడం, చొరబాట్లకు పాల్పడటం వంటి వినాశకర చర్యల్లో నిరంతరం భాగస్వాములవుతున్నట్లు హోంశాఖ పేర్కొంది. అంతేకాకుండా, సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా భారతీయ యువతను తప్పుదోవ పట్టించి టెర్రర్ రిక్రూట్‌మెంట్ (ఉగ్ర నియామకాలు) జరపడం, వారికి సరిహద్దు అవతల శిక్షణ ఇప్పించడంలో వీరు కీలక సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ తాజా నిర్ణయంతో కేంద్రం వ్యక్తిగతంగా ఉగ్రవాదులుగా గుర్తించిన పాక్ మూలాల జాబితా సంఖ్య 80కి చేరింది.

లష్కర్ వ్యవస్థాపకుడి అనుచరులపై గురి
హోంశాఖ విడుదల చేసిన ఈ నూతన జాబితాలో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదుల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తయ్యిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహ్మద్ సయీద్‌కు అత్యంత నమ్మకస్తులైన అబ్దుల్ రవూఫ్, హఫీజ్ ఖలీద్ వలీద్, రానా ఇఫ్తిఖార్ వంటి టాప్ ఆపరేటివ్స్ ఈ లిస్టులో చేరారు. వీరితో పాటు గతంలో భారత సైన్యంపై జరిగిన ఘోర దాడులైన 2016 నాటి నాగ్రోటా ఆర్మీ క్యాంప్ దాడి, 2018 సుంజ్వాన్ మిలిటరీ స్టేషన్ దాడుల వెనుక ఉండి నడిపించిన కీలక వ్యూహకర్తలపై కేంద్రం ఈ చట్టాన్ని ప్రయోగించింది.

జైషే మహమ్మద్ అధిపతి మసూద్ అజహర్ నెట్‌వర్క్‌కు చెందిన మసూద్ ఇలియాస్ కశ్మీరీ, మహమ్మద్ ముసద్దిక్, ముఫ్తీ మహ్మద్ అస్గర్ ఖాన్, హఫీజ్ అబ్దుల్ షకూర్, అబ్దుల్లా జెహాదీల పేర్లను కూడా ఇందులో చేర్చారు. కేవలం కశ్మీర్ కేంద్రంగా పనిచేసే వారే కాకుండా, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్ (ISIS) లతో బలమైన సంబంధాలు కలిగి ఉండి, గ్లోబల్ టెర్రర్ నెట్‌వర్క్‌ను నడుపుతున్న మహ్మద్ షహీద్ ఫైసల్ అనే కీలక నిర్వాహకుడిని కూడా కేంద్రం ఉగ్రవాదిగా నోటిఫై చేసింది.

అసలేంటి ఈ ‘ఉపా’ (UAPA) చట్టం? దీనివల్ల వచ్చే మార్పులేంటి?
కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తిని ‘ఉపా’ (UAPA) చట్టం కింద అధికారికంగా ఉగ్రవాదిగా ప్రకటించిన తర్వాత, సదరు వ్యక్తిపై అంతర్జాతీయంగా,దేశీయంగా కఠినమైన ఆర్థిక, చట్టపరమైన ఆంక్షలు అమలులోకి వస్తాయి.

ఈ చట్టం ప్రకారం సదరు వ్యక్తులకు సంబంధించిన అన్ని రకాల బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను తక్షణమే నిలిపివేయడానికి (Freeze) వీలు కలుగుతుంది.

భారతదేశంలో లేదా భారత పరిధిలో వారికి ఉన్న ఎలాంటి ఆస్తులనైనా జప్తు చేయడానికి (Confiscate) జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కు సంపూర్ణ చట్టపరమైన అధికారాలు లభిస్తాయి.

వీరికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఆయుధాలు, నిధులు అందకుండా అంతర్జాతీయ ఏజెన్సీల సహాయంతో ఆంక్షలు విధించవచ్చు.

నిజానికి, 2019వ సంవత్సరానికి ముందు ఈ ఉపా చట్టంలో కేవలం ఒక ఉగ్రవాద సమూహాన్ని లేదా గ్రూప్‌ను మాత్రమే నిషేధిత సంస్థగా ప్రకటించే వెసులుబాటు ఉండేది. దీనివల్ల ఒక సంస్థను నిషేధించగానే, అందులోని వ్యక్తులు మరో కొత్త పేరుతో సంస్థను స్థాపించి తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించేవారు. ఈ లొసుగును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో చట్టానికి కీలక సవరణలు చేసింది. ఈ సవరణల ద్వారా సంస్థలతో సంబంధం లేకుండా, ఉగ్రవాదానికి ఊతమిచ్చే వ్యక్తులను కూడా నేరుగా ‘ప్రకటిత ఉగ్రవాది’గా ముద్ర వేసే అపరిమిత అధికారాలను కేంద్రం దక్కించుకుంది. తాజా చర్య ద్వారా సీమాంతర ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలనే భారత్ సంకల్పం మరోసారి స్పష్టమైంది.

కేంద్రం కొత్తగా ప్రకటించిన 23 మంది ఉగ్రవాదుల పూర్తి జాబితా:
మసూద్ ఇలియాస్ కశ్మీరీ

మహమ్మద్ ముస్సదిక్

ముఫ్తీ ముహమ్మద్ అస్గర్‌ఖాన్

హఫీజ్ అబ్దుల్ షకూర్

అబ్దుల్లా జెహాదీ

ఫిర్‌దౌస్ అహ్మద్ భట్

గులాం ఫరీద్

బిలాల్ అహ్మద్ మీర్

అబిద్ ఖుయూమ్‌లోన్

నజీర్ అహ్మద్ గుజ్జర్

అబ్దుల్ రవూఫ్

అష్ఫాక్ అహ్మద్

హఫీజ్ ఖలీద్ వలీద్

మౌలానా సైఫుల్లా ఖలీద్

మహమ్మద్ యాకూబ్

మోలానా యూసఫ్ తైబీ

ఒవైస్ ఫరూజ్

ఖారీ యాకుబ్ షేక్

రాణా ఇఫ్తికార్

వసీం … నూర్ జాట్

మహమ్మద్ షహీద్ ఫైసల్

మౌలానా ఇమ్‌దాద్ ఉల్లా మక్కీ

హరూన్ రషీద్ గనై

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.