
Agra woman kills husband : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్యంత కలకలం రేపిన ఒక ఘోర హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపి, ఎవరికీ అనుమానం రాకుండా ఆ మృతదేహాన్ని ఏకంగా బాత్రూమ్ నేల కిందే పాతిపెట్టి టైల్స్ వేసిన ఒక భార్య ఘాతుకం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పైగా ఏమీ ఎరుగనట్టు నటిస్తూ.. భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఇరుగుపొరుగు వారి ముందు కన్నీరు మున్నీరైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాలోని సికంద్రా పరిధి దహతోరా ప్రాంతంలో సురేంద్ర శర్మ (44) తన భార్య రూబీ శర్మ, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. వీరికి వివాహమై 16 ఏళ్లు పూర్తయ్యాయి. గత మే 26న సురేంద్ర శర్మ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. దీనిపై భార్య రూబీ సికంద్రా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టింది. నాటి నుంచి గత 45 రోజులుగా తన భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడని, ఆయన లేకపోవడంతో తన హృదయం బద్దలైపోతోందంటూ చుట్టుపక్కల వారి దగ్గర ప్రతిరోజూ ఏడుస్తూ అందరినీ నమ్మించింది.
పక్కా స్కెచ్‌తో గొంతు నులిమి హత్య
అయితే ఈ అదృశ్యం వెనుక రూబీ శర్మ ఆడిన పక్కా స్కెచ్ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మే 26న పథకం ప్రకారం తన ఇద్దరు కుమార్తెలను సురేంద్ర శర్మ పెద్దన్నయ్య ఇంటికి పంపించివేసింది. ఆ తర్వాత భర్తకు ఇష్టమైన ఖీర్ (పాయసం) వండి, అందులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అది తిన్న సురేంద్ర శర్మ స్పృహ కోల్పోగానే, ఆమె అతడి గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది.
మరుసటి రోజు ఉదయం ఎవరికీ తెలియకుండా బాత్రూమ్లో పెద్ద గొయ్యి తవ్వి, అందులో భర్త శవాన్ని పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ప్రదేశంపై కాంక్రీట్ వేసి, కొత్తగా టైల్స్ ప్లాస్టరింగ్ చేయించి పూర్తిగా కప్పివేసింది.
పోలీసుల తనిఖీతో దొరికిపోయిన నిందితురాలు
అయితే, సురేంద్ర శర్మకు సంబంధించిన ఒక పాత కేసుకు సంబంధించి రొటీన్ వెరిఫికేషన్ కోసం పోలీసులు ఇటీవల అతడి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రూబీ శర్మ తీవ్రంగా కంగారుపడుతూ, తన బావను (భర్త అన్నయ్యను) ఇంటికి పిలిపించింది. రూబీ ప్రవర్తనపై మొదటి నుంచి అనుమానంతో ఉన్న మృతుడి సోదరుడు పోలీసులకు తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. దీంతో పోలీసులు రూబీని తమదైన శైలిలో విచారించగా, ఆమె తట్టుకోలేక నేరాన్ని అంగీకరించి శవాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని చూపించింది.
వెంటనే పోలీసులు కార్మికుల సహాయంతో బాత్రూమ్ కొత్త ఫ్లోరింగ్, టైల్స్‌ను పగలగొట్టి చూడగా సురేంద్ర శర్మ మృతదేహ అవశేషాలు బయటపడ్డాయి. శవాన్ని వెలికితీసిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హరిపర్వత్ సర్కిల్ ఏసీపీ అమీషా మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. నిందితురాలు రూబీ శర్మను అదుపులోకి తీసుకున్నామని, ఈ హత్యకు గల అసలు కారణాలేంటి? మృతదేహాన్ని దాచడంలో ఆమెకు మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.









