తిరుమల శ్రీవారి భక్తులకు TTD ఒక తీపి కబురు చెప్పింది. ఏడుకొండల స్వామిని దర్శించుకున్నాక భక్తులు ఎంతో ఇష్టంగా, భక్తితో తీసుకునే శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్మకాలు ఈ ఏడాది జూన్ నెలలో సరికొత్త రికార్డు సృష్టించాయి. ఎండల సెలవులు కావడం, భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో టిటిడి ముందుగానే ప్లాన్ చేసి లడ్డూల తయారీని భారీగా పెంచింది. ఎక్కడా లడ్డూల కొరత లేకుండా భక్తులకు అందించడంతో ఈ రికార్డు స్థాయి అమ్మకాలు సాధ్యమయ్యాయి.

ఈ ఏడాది గత మూడు నెలల లెక్కలు చూస్తే.. లడ్డూల అమ్మకాలు నెలనెలా బాగా పెరుగుతూ వచ్చాయి. ఏప్రిల్ నెలలో 1,11,96,170 లడ్డూలు, మే నెలలో 1,21,35,528 లడ్డూలు అమ్ముడవగా.. జూన్ నెల వచ్చేసరికి ఆ సంఖ్య ఏకంగా 1,26,81,805 (దాదాపు 1.27 కోట్లు) కి చేరింది.

గడిచిన మూడేళ్ల జూన్ నెలల రికార్డులను గమనిస్తే తిరుమలకు భక్తులు ఎంతలా పెరుగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. 2024 జూన్ నెలలో 1,02,64,364 లడ్డూలు, 2025 జూన్ నెలలో 1,19,21,353 లడ్డూలు అమ్ముడయ్యాయి. వీటన్నింటినీ దాటుకుంటూ ఈ 2026 జూన్ నెలలో రికార్డు స్థాయిలో 1,26,81,805 లడ్డూలు అమ్ముడవడం విశేషం.

అంటే, గత ఏడాది (2025) జూన్‌తో పోలిస్తే ఈసారి 7,59,452 లడ్డూలు ఎక్కువగా అమ్ముడయ్యాయి. అలాగే రెండేళ్ల క్రితం (2024) తో పోల్చి చూస్తే.. ఈసారి ఏకంగా 24,17,441 లడ్డూలు అదనంగా అమ్ముడయ్యాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, టిటిడి పక్కా ప్లానింగ్‌తో లడ్డూలను తయారు చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.