UIDAI

UIDAI : ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ యూఐడీఏఐ ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్‌ కార్డులో ఈమెయిల్ ఐడీని లింక్ చేయడం లేదా మార్చుకోవడం కోసం ఇకపై ఎలాంటి ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియను నేరుగా అధికారిక ఆధార్ యాప్ ద్వారానే ఉచితంగా చేసుకునే సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ సరికొత్త సేవలు 2026 జూలై 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. వచ్చే ఆరు నెలల పాటు పూర్తి ఉచితంగా కేవలం ఆధార్ యాప్ ద్వారానే ఈ సేవలను వాడుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రజలు తమ ఆధార్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సులభంగా అప్‌డేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ కొత్త ఆప్షన్ యాప్‌లోకి వచ్చిన కేవలం రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా 2.5 లక్షల (250,000) కంటే ఎక్కువ మంది ప్రజలు తమ ఈమెయిల్ అడ్రస్‌లను విజయవంతంగా అప్‌డేట్ చేసుకోవడం విశేషం.

ఆధార్‌తో ఈమెయిల్ ఐడీని అనుసంధానం చేయడం వల్ల భద్రత మరింత పెరుగుతుందని అధికారులు వివరించారు. ఎప్పుడైనా, ఎక్కడైనా మీ ఆధార్ నంబర్ ఉపయోగించి బయోమెట్రిక్ లేదా ఓటీపీ వెరిఫికేషన్ జరిగిన వెంటనే మీ ఈమెయిల్‌కు రియల్ టైమ్ నోటిఫికేషన్ వస్తుంది. దీనివల్ల మీ ఆధార్ ఎక్కడెక్కడ వాడబడుతుందో మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఇది ఆధార్ వాడకంలో పారదర్శకతను పెంచడమే కాకుండా, ఎలాంటి దుర్వినియోగం జరగకుండా అదనపు రక్షణను కల్పిస్తుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.