meghalaya

Meghalaya Honeymoon Murder : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయకు హనీమూన్‌ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ దారుణంగా హత్య చేసిన కేసులో ఆయన భార్య సోనమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆమెకు మేఘాలయ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.అంతేకాకుండా ఈ కేసులో మేఘాలయ హైకోర్టు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

లోయర్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ శీల్ నాగులతో కూడిన బెంచ్ విచారణ జరిపి, నోటీసులు జారీ చేసింది. నిందితురాలు సోనమ్ ఇప్పటికే జైలు నుంచి విడుదలైనందున, ఇప్పుడు ఆమె బెయిల్‌ను ఆపలేమని కోర్టు స్పష్టం చేసింది. ఆమె అప్పటికే జైలు నుంచి బయటకు వచ్చేసిందని లాయర్లు చెప్పారు. దీంతో ఇప్పుడు తాము స్టే ఇవ్వలేమని, ఒకవేళ జైట్లోనే ఉండి ఉంటే ఖచ్చితంగా స్టే ఇచ్చేవాళ్లమని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇంతకు కేసు ఏంటంటే..

2025 మే నెలలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక దారుణమైన హత్యోదంతం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ (29), సోనమ్ రఘువంశీ (25)లకు 2025 మే 11న వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని రోజులకే, అంటే మే 20న వారు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అయితే భర్తను చంపేందుకు అప్పటికే తన ప్రియుడితో పాటుగా మరికొంతమంది కిల్లర్ లను మాట్లాడి పెట్టింది సోనమ్. వారు కూడా టూరిస్టుల్లాగే వీరి వెనకాలే కొండల్లోకి వచ్చారు. నిర్మానుష్య ప్రాంతంలో భార్య సోనమ్ స్వయంగా పాల్గొని, ఆ ముగ్గురు దుండగులతో కలిసి రాజా రఘువంశీపై కొడవళ్లతో ఘోరంగా దాడి చేసి చంపేసింది. అనంతరం బాడీని లోయలోకి పడేశారు.

మొదట ఇదొక ప్రమాదం లేదా కిడ్నాప్ అని అందరూ అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో భార్య సోనమ్ రఘువంశీ అసలు రంగు బయటపడింది. ఆమె పెళ్లికి ముందే తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్తను చంపడానికి ప్లాన్ వేసిందని పోలీసులు గుర్తించారు.

హత్య చేసిన తర్వాత సోనమ్ అక్కడి నుంచి పారిపోయింది. తాను కూడా కిడ్నాప్ అయ్యానని, తప్పించుకు వచ్చానని ఒక కథ అల్లి డ్రామా ఆడాలని చూసింది. కానీ పోలీసులు సాంకేతిక ఆధారాలు, సిసిటివి ఫుటేజ్ సేకరించి జూన్ 9, 2025న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ వద్ద ఆమెను అరెస్ట్ చేశారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.