
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం కారణంగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
Also Read : టీజీపీఎస్సీ మరో కొత్త నోటిఫికేషన్.. అర్హత, జీతం, చివరితేదీ వివరాలివే..!
ఆంధ్రప్రదేశ్‌లో వాయవ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఈ అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.
ఏపీలోని శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రైతులు, ప్రజలు బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు.
Also Read : రూ. 200 కోట్లకు పైమాటే.. కళ్లు చెదిరేలా DSP భీమ్‌రెడ్డి అక్రమాస్తులు..!









