
Ram Mandir Theft Case : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల అపహరణ కేసు (Ram Mandir Donation Theft Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయ విరాళాల లెక్కింపు వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని, కొందరు ఇంటిదొంగలే అత్యంత సునాయాసంగా కోట్ల రూపాయల సొమ్మును బయటకు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గతేడాది ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన కుంభమేళా (Kumbh Mela) సమయంలోనే ఈ భారీ చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో కుంభమేళాకు వచ్చిన కోట్లాది మంది భక్తులు అయోధ్య రామ మందిరాన్ని కూడా సందర్శించడంతో, ఆలయానికి కానుకలు, విరాళాలు భారీ మొత్తంలో వచ్చాయి. ఇదే అదునుగా భావించిన నిందితులు, పక్కా ప్రణాళికతో కానుకల నుంచి కోట్ల రూపాయలు మాయం చేశారు.
తాళాలు దొంగిలించి.. సీసీటీవీలకు చిక్కకుండా..
ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన అవినాష్ శుక్లాను కోర్టు అనుమతితో పోలీసులు మంగళవారం రెండు గంటల పాటు నిశితంగా విచారించారు. ఈ సందర్భంగా అతడు చోరీకి సంబంధించిన పూర్తి కుట్రను అంగీకరించాడు. విరాళాల కౌంటింగ్ గదికి ఉన్న తాళాలను మరో నిందితుడు టిన్నూ యాదవ్ దొంగిలించి సంపాదించాడు. ఆ తర్వాత ఎవరూ లేని సమయం చూసుకుని ఆ గదిలోని డబ్బును దొంగిలించేవారు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, వాటిని ఎవరు పర్యవేక్షిస్తారు అనే విషయాలపై నిందితులకు పూర్తి అవగాహన ఉంది. దీంతో కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు, చోరీ చేసిన సొమ్మును మొదట ఆలయ వాష్‌రూమ్‌లలో దాచిపెట్టేవారు. అనంతరం అనుకూలమైన సమయం చూసుకుని ఎవరికీ అనుమానం రాకుండా బయటకు తరలించేవారని పోలీసు వర్గాలు తెలిపాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులతో తమకున్న సాన్నిహిత్యం కారణంగానే తమను ఎవరూ అనుమానించలేకపోయారని అవినాష్ శుక్లా విచారణలో అంగీకరించాడు.
నిందితుల ఇళ్లలో సోదాలు: రూ. 70 లక్షల నగదు, డాలర్లు సీజ్
ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేపట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. సిట్ నివేదిక మేరకు జూన్ 25న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో అవినాశ్ శుక్లా, అనుకల్ప్ శుక్లా (అనుకల్ప్ మిశ్రా), లవ్‌కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా , శుభాష్ శ్రీవాత్సవ, రామశంకర్ యాదవ్ ఉన్నారు.
వీరిలో లవ్‌కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అనే బావమరుదులు అత్యధిక మొత్తంలో నగదు దొంగిలించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల ఇళ్లలో పోలీసులు జరిపిన సోదాల్లో మొత్తం రూ. 70,25,000 నగదు లభించింది. ఇందులో అత్యధికంగా అవినాశ్ శుక్లా ఇంట్లో రూ.20 లక్షల నగదుతో పాటు 1,121 యూఎస్ డాలర్లు లభించాయి. అలాగే కరుణేశ్ పాండే ఇంట రూ.18 లక్షలు, అనుకల్ప్ మిశ్రా ఇంట్లో రూ.16 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. కోర్టు వీరికి జులై 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
బ్యాంక్ ఉద్యోగుల పాత్రపై అనుమానం.. ఈడీ, ఐటీ రంగంలోకి!
చోరీ చేసిన సొమ్ముతో నిందితుడు అవినాష్ శుక్లా ఇల్లు, స్థలాలు కొనుగోలు చేసినట్లు అంగీకరించడంతో నిందితుల ఆస్తులపై పోలీసులు దృష్టి సారించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, అక్రమ ఆస్తుల వివరాలను పూర్తిగా పరిశీలించడానికి పోలీసులు ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సహాయాన్ని తీసుకుంటున్నారు. కాగా, ఈ ముఠాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు చెందిన కొందరు ఉద్యోగులు కూడా సహకరించినట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్ సిబ్బందితో నిందితులు కుమ్మక్కై డబ్బును అక్రమంగా తరలించినట్లు తెలుస్తోంది.
మరోవైపు, విచారణ సమయంలో నిందితులు పలుమార్లు ట్రస్టీ అనిల్ మిశ్రా పేరును ప్రస్తావించినట్లు సమాచారం. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు సుదీర్ఘకాలంగా ఎలా ఈ చోరీకి పాల్పడ్డారు, వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు, సిట్ బృందాలు నిందితుల బంధువులను సైతం ప్రశ్నిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశాయి.









