Benjamin Netanyahu : పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ కోసం ఇరాన్‌తో అమెరికా చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోన్న వేళ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇచ్చే ఆర్థిక సాయం తమకు అవసరం లేదంటూ ట్రంప్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. యూఎస్ అందించే ఆర్థిక సాయం ఒక ఉచిత సంక్షేమం (Welfare) లాగా మారిందని, తాము దానిపై ఆధారపడదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ ఎంతమాత్రం చిన్నది కాదని, అది దాదాపు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటోందని ఆయన గుర్తుచేశారు. తమ మొత్తం జీడీపీ (GDP)తో పోలిస్తే అమెరికా ఇచ్చే నిధులు చాలా స్వల్పమని, అందుకే రాబోయే పదేళ్లలో దశలవారీగా యూఎస్ సాయాన్ని పూర్తిగా సున్నాకు తగ్గించి నిలిపివేస్తామని నెతన్యాహు ప్రకటించారు.

ఇరాన్‌పై ఒంటరి పోరాటానికైనా సిద్ధం!

టెహ్రాన్‌ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ కఠిన వైఖరిని అవలంబిస్తుందని నెతన్యాహు హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలను (Nuclear Capabilities) సంపాదించకుండా నిరోధించే విషయంలో తాము పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరిస్తామని, ఎవరిపైనా ఆధారపడబోమని స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు విఫలమైతే, ఇరాన్‌పై దాడి చేయడానికి తాము వెనుకాడబోమని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ దేశంపై రెండుసార్లు సైనిక చర్యలు చేపట్టిన ఇజ్రాయెల్, అవసరమైతే మూడోసారి కూడా దాడులు చేయడానికి కావాల్సిన పూర్తి సైనిక సామర్థ్యం తమకు ఉందని ఉద్ఘాటించింది. ఇరాన్‌కు ప్రయోజనం చేకూర్చే ఏ ఒప్పందాన్నైనా ఇజ్రాయెల్ ఎప్పటికీ అంగీకరించబోదని నెతన్యాహు తేల్చిచెప్పారు.

లెబనాన్ నుంచి వెనక్కి తగ్గేదే లేదు

మరోవైపు లెబనాన్‌ (Lebanon)పై ఇజ్రాయెల్‌ దాడులు ఆపాలని, అలా చేస్తేనే తాము అమెరికాతో ఒప్పందానికి వస్తామని ఇరాన్‌ కండిషన్ పెడుతోంది. అయితే ఈ డిమాండ్‌ను నెతన్యాహు పూర్తిగా తిరస్కరించారు. మంగళవారం దక్షిణ లెబనాన్‌లోని ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన ఆయన, అక్కడ తమ దళాలతో సమీక్ష నిర్వహించారు. ఇరాన్, హిజ్బుల్లా నుంచి వచ్చే అణు, భద్రతా ముప్పులు పూర్తిగా తొలగిపోయే వరకు దక్షిణ లెబనాన్‌ను వదిలి వచ్చే ప్రసక్తే లేదని తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. తుది ఒప్పందం కుదిరేదాకా ఇజ్రాయెల్‌ బలగాలు బీరుట్‌లోనే ఉంటాయని స్పష్టం చేయడంతో, అటు అమెరికాకు ఇటు ఇరాన్‌కు గట్టి సవాల్ విసిరినట్లయింది.

ఇరు దేశాల మధ్య పెరుగుతున్న దూరం

ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న ఈ దౌత్యపరమైన చర్చల్లో తమ ప్రయోజనాలను, అభిప్రాయాలను ట్రంప్ యంత్రాంగం పక్కన పెట్టేస్తోందని ఇజ్రాయెల్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లెబనాన్‌పై దాడుల విషయంలో ఇటు అమెరికా సీరియస్‌గా ఉన్నప్పటికీ, నెతన్యాహు మాత్రం వాటిని ఖాతరు చేయకుండా స్వతంత్ర నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ పరిణామాలన్నీ గత కొంతకాలంగా మిత్రదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక దూరాన్ని స్పష్టం చేస్తున్నాయి.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.