
VB GRAMG : కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో చారిత్రాత్మక మార్పులు చేస్తూ తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (VB-G RAM G – వీబీ జీరామ్‌జీ) చట్టం-2025 బుధవారం (జూలై 1, 2026) నుండి దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది. పాత పథకం గడువు మంగళవారంతో ముగియడంతో, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ సరికొత్త చట్టాన్ని, సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది.
ఈ చట్టం ద్వారా సాధించిన అతిపెద్ద మార్పు ఏమిటంటే.. ఇప్పటివరకు ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి లభిస్తున్న చట్టబద్ధమైన పనిదినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచారు. ‘వికసిత్ భారత్ @2047’ విజన్‌ను సాధించడంలో భాగంగా గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేసేందుకు,మరింత మందికి ఉపాధి కల్పించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.కొత్త చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు కనీస రోజువారీ వేతనాన్ని రూ. 300 గా నిర్ణయించారు. దేశంలోని ఏ ఒక్క కార్మికుడికి కూడా దీనికంటే తక్కువ వేతనం లభించకుండా కేంద్రం మధ్యంతర వేతన పరిమితిని (interim wage floor) విధించింది. ఈ సవరణకు ముందు దేశంలో అత్యల్ప ఉపాధి హామీ వేతనం రోజుకు రూ. 241 గా ఉండటం గమనార్హం.
కొత్త పథకం అమలుతో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ సగటు రోజువారీ వేతనం రూ. 298.8 నుండి రూ. 327.4 కి పెరిగింది. అంటే సగటున రోజుకు రూ. 28.6 చొప్పున 10 శాతానికి పైగా వేతనం పెరిగింది. దేశవ్యాప్తంగా రోజువారీ వేతనాన్ని కనిష్ఠంగా రూ. 300 నుండి గరిష్ఠంగా రూ. 409 గా నిర్ణయించగా, సిక్కింలోని కొన్ని ప్రత్యేక పంచాయతీలలో మాత్రం అత్యధికంగా రూ. 450 చెల్లించనున్నారు. గతంలో తక్కువ వేతనాలు ఉన్న వెనుకబడిన రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, ఝార్ఖండ్, అస్సాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లలో గతంతో పోలిస్తే వేతనాలు 15% నుండి 25% వరకు పెరిగాయి. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలలో అత్యధికంగా దాదాపు 24.5% వేతనాల పెంపు నమోదైంది.
గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు పలు ఈశాన్య రాష్ట్రాలతో కలుపుకుని మొత్తం 21 రాష్ట్రాలలో రోజువారీ కనీస వేతనం రూ. 300 గా స్థిరపరిచారు. అయితే, దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మాత్రం వేతనాల పెంపు 3 శాతం కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రముఖ రాష్ట్రాల్లో ఖరారైన రోజువారీ వేతనాల వివరాలు ఇలా ఉన్నాయి: తెలంగాణలో రూ. 308, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 312, మహారాష్ట్రలో రూ. 317, దాద్రానగర్ హవేలీ & దమన్ దీవ్‌లో రూ. 340, తమిళనాడులో రూ. 345, పుదుచ్చేరిలో రూ. 347, కర్ణాటకలో రూ. 382, కేరళలో రూ. 401, గోవాలో రూ. 406 చొప్పున కేంద్రం వేతనాలను నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానంలోకి వ్యవస్థ సజావుగా మారడానికి, కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించడానికి వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ. 95,692.31 కోట్ల మధ్యంతర బడ్జెట్‌ను కేటాయించింది. నీటి సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ, వ్యవసాయం, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన మరియు మహిళా సాధికారత వంటి రంగాలలో శాశ్వత ఆస్తులను సృష్టించడం ఈ పథకం ముఖ్య లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. వచ్చే వారం రోజుల పాటు వానలే వానలు
కొత్త చట్టం అమలు నేపథ్యంలో, ఉపాధి హామీ పథకానికి గానూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పాత పద్ధతిలో వేతన సవరణ చేపట్టకుండా వాయిదా వేసింది. ఇప్పుడు కొత్త చట్టం ద్వారానే వేతన సవరణను అమల్లోకి తెచ్చింది. దీనికి ముందు చివరిసారిగా గతేడాది మార్చి 27న కేంద్రం వేతనాలను సవరించింది. బుధవారం నుండి ప్రారంభమయ్యే కొత్త పనులన్నీ, వాటి రికార్డులు, మస్టర్ల నమోదు, వేతనాల చెల్లింపులు పూర్తిగా జీరామ్‌జీ పేరిటే జరగనున్నాయి. ఇందుకోసం కొత్త వెబ్‌సైట్‌తో పాటు పాత యాప్‌ల పేర్లను కూడా మార్చనున్నారు.
ఈ పథకం అమలుకు గానూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ. 3,825.31 కోట్లు మంజూరు చేసింది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన 40% వాటా కింద రూ. 2550.21 కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. గత ఏడాది కేంద్రం కేటాయించిన 8.50 కోట్ల పనిదినాల్లో తెలంగాణ రాష్ట్రం 8 కోట్ల పనిదినాలను మాత్రమే పూర్తి చేసింది. పాత పథకంలో భాగంగా కొనసాగుతున్న మహిళాసంఘాల భవనాలు, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, పాఠశాల గదుల వంటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు కేంద్రం అనుమతించింది. అయితే, వ్యవసాయ సీజన్‌లో రెండు నెలలు పనులకు విరామం ప్రకటించే సమయాన్ని నిర్ణయించే అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకే ఇచ్చింది.
ఈ కొత్త పథకంలోని కొన్ని నిబంధనలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. దీనిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే శాసనసభలో తీర్మానం కూడా చేసింది. పాత పద్ధతిలో రాష్ట్రాల డిమాండ్లకు అనుగుణంగా పనుల మంజూరు ఉండేది, కానీ జీరామ్‌జీలో కేంద్రం నిర్ణయానుసారమే పనులు చేయాలనే నిబంధన తెచ్చారు. అలాగే, వ్యవసాయ సీజన్‌లో 60 రోజులు పనులకు విరామం ఇవ్వాలనే నిబంధన వల్ల కూలీలకు నష్టం జరుగుతుందని రాష్ట్రం వాదిస్తోంది. ఈ నిబంధనలను సడలించకపోతే రాష్ట్రంలో ‘ప్రత్యేక ఉపాధి హామీ పథకం’ అమలు చేయాలనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
రాష్ట్ర మంత్రి సీతక్క స్వయంగా ఢిల్లీ వెళ్లి ఈ పథకం అమలును వాయిదా వేయాలని కోరినా కేంద్రం స్పందించలేదు. ఈ పథకంలో చేరాలా వద్దా అనే అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. రేపు జరగబోయే మంత్రిమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ, కేంద్ర సూచనల ప్రకారం కొత్త ఆర్‌బీఐ అకౌంట్‌ను ప్రారంభించింది. అలాగే రాష్ట్రంలో ముఖ గుర్తింపు విధానం అమలు చేస్తూ, 94.58% ఈ-కేవైసీ పూర్తి చేసినట్లు కేంద్రానికి నివేదించింది.
Also Read : మొగుణ్ణి వదిలేస్తా కానీ ప్రియుణ్ణి వదలను.. అడ్డంగా దొరికిపోయిన భార్య షాకింగ్ కామెంట్స్!









