
మధ్యప్రాచ్యంలో రోజురోజుకూ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. లెబనాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం జరుగుతున్న సైనిక దాడుల వెనుక పెద్ద అంతర్జాతీయ రాజకీయ వ్యూహం దాగి ఉందంటూ ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య కొత్తగా కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ లెబనాన్‌లో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఆ దేశ ప్రధాన సంధానకర్త మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ప్రాంతీయంగా శాంతి నెలకొంటుందని, కానీ ఇజ్రాయెల్ దీనిని ఎంతమాత్రం సహించలేకపోతోందని ఆయన మండిపడ్డారు.
స్విట్జర్లాండ్‌లో దౌత్యపరమైన చర్చలను ముగించుకుని తిరిగొచ్చిన ఘాలిబాఫ్ కొన్ని విషయాలు వెల్లడించారు. ఇరాన్, అమెరికాల మధ్య 14 అంశాలతో కూడిన ఒక అవగాహన ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. ఈ ఒప్పందంలోని నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తాము దౌత్యపరమైన ఏర్పాట్లు పూర్తి చేసిన తరుణంలోనే, ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులను ఉధృతం చేసిందని తెలిపారు. ఒప్పందంపై సంతకాలు జరిగిన సరిగ్గా వారం రోజులకే ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది.
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం లెబనాన్ అధికారిక సరిహద్దులను గౌరవిస్తూ యుద్ధాన్ని తక్షణమే ముగించాలి. ఆక్రమిత ప్రాంతాల నుండి శత్రు బలగాలు పూర్తిగా వెనక్కి వెళ్లాలని, యుద్ధం వల్ల ఇళ్లు కోల్పోయిన శరణార్థులను తిరిగి వారి సొంత ప్రాంతాలకు చేర్చాలని స్పష్టం చేశారు. అయితే ఈ నిబంధనల వల్ల తాము ఆక్రమించిన ప్రాంతాలను ఖాళీ చేయాల్సి వస్తుందని ముందే ఊహించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం.. ఈ ఒప్పందం అమలు కాకుండా అడ్డుపడటానికి తన సైనిక చర్యలను మరింత క్రూరంగా మార్చిందని ఆయన ఆరోపించారు. కీలకమైన భౌగోళిక ప్రాంతాలను ధ్వంసం చేసి తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందన్నారు. నిజానికి లెబనాన్ అంతర్గత భద్రతను కాపాడే పూర్తి బాధ్యతను ఆ ప్రభుత్వానికే అప్పగించాలనేది ఈ ఒప్పందం అని తెలిపారు. ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వంలో కూడా ఈ ఒప్పందంపై అంతర్గత విభేదాలు ఉన్నాయని, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒప్పందానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుంటే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరో మార్గాన్ని అనుసరిస్తున్నారన్నారు.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఆయన స్వయంగా దక్షిణ లెబనాన్‌లోని సరిహద్దు భద్రతా మండలాన్ని సందర్శించి, తమ దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్నంత కాలం ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ భూభాగాన్ని విడిచిపెట్టదని సైనికులతో ఖరాఖండీగా చెప్పారు. గతంలో లాగా తమ సరిహద్దు లోపల రక్షణ చూసుకోవడం కాకుండా, శత్రువుల భూభాగంలోనే బఫర్ జోన్లను ఏర్పాటు చేసి అక్కడే ఉగ్రవాదులను అణచివేయడం తమ వ్యూహమని అన్నారు.









