CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy :  గత పదేళ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం అక్షరాలా రూ. 8 లక్షల 11 వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన 19 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు కేవలం రూ. 60 వేల కోట్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి రూ. 6 లక్షల కోట్ల అప్పు ఉందని భావించామని, కానీ అధికారంలోకి వచ్చి తవ్వుతున్నకొద్దీ కొండలంత అప్పుల కుప్పలు బయటపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని తమకు అప్పగించారని సీఎం పేర్కొన్నారు.

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, చివరకు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరిందని సీఎం విమర్శించారు. గతంలో ఇన్‌స్టాల్‌మెంట్ల పద్ధతిలో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని, చివరకు సీఎస్ వంటి ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారులకు సైతం ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోయారని గుర్తుచేశారు. బడిపిల్లల మధ్యాహ్న భోజన తిండి బిల్లులను కూడా వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టారని, అలాగే గ్రామాల్లో పనులు చేసిన సర్పంచ్‌లకు వేల కోట్లు పెండింగ్‌లో పెట్టడం వల్లే నేడు వారు ధర్నాలు చేయాల్సి వస్తోందని మండిపడ్డారు.

ఇలాంటి ఆర్థిక సంక్షోభంలోనూ తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయం దండగ కాదు.. పండగలా చేస్తున్నాం అని పేర్కొన్న ఆయన, సాగు పనులు మొదలయ్యే నాటికే రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు. గత 30 నెలల్లో రైతు శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేశామని, అధికారంలోకి వచ్చిన కేవలం ఆరు నెలల కాలంలోనే రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో రూ. 22,600 కోట్లు జమ చేశామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.