
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తోంది. సొంత బలంతోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోంది. రాష్ట్ర పర్యటనలో ఉన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇప్పటికే అంతర్గత వ్యూహాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “అధికారంలోకి రావడమే మన ఏకైక టార్గెట్, ఈ రోజు తేదీని గుర్తుపెట్టుకోండి” అంటూ కేడర్‌లో జోష్ నింపారు. ప్రత్యర్థులు చేస్తున్న ‘బీఆర్ఎస్-బీజేపీ పొత్తు’ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, క్షేత్రస్థాయిలో పార్టీ రోజురోజుకూ బలపడుతోందని కమలనాథులు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలను ముమ్మరం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధుల (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) రోజువారీ కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక టైం టేబుల్‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ ఓడిపోతే తెలంగాణలో ఒంటరి పోరు ఖాయమని, ఒకవేళ సమీకరణాలు మారితే అప్పటి పరిస్థితులను బట్టి జాతీయ నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని మరికొందరు అంతర్గతంగా అభిప్రాయపడుతున్నారు.
Also Read : మహిళల భద్రతకు ‘షీ నేత్ర’ రక్షణ కవచం
తెలంగాణపై పట్టు సాధించేందుకు వీలుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ ఇకపై పూర్తి సమయాన్ని ఇక్కడే కేటాయించనున్నారు. గతంలో బెంగాల్, ఒడిసాలతో పాటు తెలంగాణ బాధ్యతలను చూసిన ఆయన.. ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీ విజయతీరాలకు చేరడంతో ఇప్పుడు తెలంగాణపైనే పూర్తి నిఘా పెట్టబోతున్నారు. మరోవైపు, రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి అభయ్ పాటిల్‌కు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరుపై ఢిల్లీ అధిష్టానానికి నిరంతరం నివేదికలు అందుతున్నాయని, ఇటీవల మునిసిపల్ ఎన్నికల్లో కొందరు నేతలు అనుసరించిన వైఖరిపై, కోవర్టు రాజకీయాలపై హైకమాండ్ సీరియస్‌గా ఉందని.. ఈ క్రమంలోనే నితిన్ నబీన్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నాలుగు కార్పొరేషన్ల పర్యవేక్షణ బాధ్యతలను మహారాష్ట్ర మంత్రి ఆశిశ్, రాజ్యసభ సభ్యురాలు రేఖాశర్మలకు అప్పగించింది. ఈ కార్పొరేషన్లలోని మెజారిటీ డివిజన్లు బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల (సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్) పరిధిలోకి వస్తుండటంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇక వరంగల్ కార్పొరేషన్ బాధ్యతలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కి అప్పగించే యోచనలో అధిష్టానం ఉంది.
ఇటీవలి మునిసిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్‌ను తొలిసారిగా గెలుచుకోవడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆయన దూకుడుగా ప్రచారం చేసి పార్టీకి అనూహ్య సీట్లు సాధించి పెట్టారు. సంజయ్ ప్రసంగాలు, ప్రచార శైలి కేడర్‌లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, వివిధ సామాజిక వర్గాలను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సైతం బండి సంజయ్‌ను విస్తృతంగా ప్రచారంలోకి దించాలని పార్టీ భావిస్తోంది. ఈ నాలుగు కార్పొరేషన్లను కైవసం చేసుకుంటే అసెంబ్లీ ఎన్నికల రోడ్‌మ్యాప్ మరింత సులువవుతుందని సీనియర్ నేతలు భావిస్తున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే పరిమితమైన బీజేపీ.. ఆ తర్వాత ఆరు నెలలకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా 50 శాతం సీట్లు (8 ఎంపీ స్థానాలు) సాధించి టాప్ గేర్‌లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలవడంతో పాటు, మునిసిపల్ ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గట్టి పట్టు సాధించి ఓటు బ్యాంకును భారీగా పెంచుకుంది. ఈ ఊపును ఇలాగే కొనసాగించేందుకు రాబోయే రెండు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ నేతల పర్యటనలు మరింతగా పెరగనున్నాయి. కేంద్ర మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ క్యాడర్‌ను ఎన్నికల సమరానికి సమాయత్తం చేయనున్నారు.
Also Read : ఫ్రీ ఫైర్ ఆన్ లైన్ గేమ్ వేదికగా బాలికలకు వల.. మాయగాళ్ల సరికొత్త పంథా









