
పశ్చిమాసియాలో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. హోర్ముజ్ జలసంధి వేదికగా ఇరు దేశాల మధ్య చెలరేగిన పరస్పర దౌత్య, సైనిక ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలను రేకెత్తించినప్పటికీ, తాజాగా ఇరుపక్షాలు ఒక కీలక నిర్ణయానికి వచ్చాయి. ప్రస్తుతం నడుస్తున్న చర్చల ప్రక్రియకు భంగం కలగకుండా ఉండేందుకు వీలుగా పరస్పర దాడులను నిలిపివేయాలని (కాల్పుల విరమణ) అమెరికా, ఇరాన్ ఒక అవగాహనకు వచ్చాయి. ఈ తాత్కాలిక విరామం తర్వాత, మరింత సమగ్రమైన చర్చల కోసం ఇరు దేశాల ప్రతినిధులు మంగళవారం ఖతార్ రాజధాని దోహాలో భేటీ కానున్నారు.
ఈ ఉద్రిక్తతలకు హోర్ముజ్ జలసంధిలో జరిగిన పరిణామాలే ప్రధాన కారణమయ్యాయి. తమ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తోందనే నెపంతో ‘ఎవర్ లవ్లీ’ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో వివాదం మొదలైంది. ఇది కాకుండా, పనామా జెండాతో వెళ్తున్న ‘కికు’ అనే భారీ చమురు ట్యాంకర్‌పైనా దాడి జరిగింది. ఈ చర్యలను తీవ్రంగా పరిగణించిన అమెరికా.. ఇరాన్ ముందస్తు ఒప్పందాలను ఉల్లంఘించిందంటూ శని, ఆదివారాల్లో ఇరాన్ పరిధిలోని ఖెష్మ్ దీవి, సిరిక్, బందర్ ఇ లెంగే నగరాల్లోని 10 సైనిక స్థావరాలపై విమానాలతో విరుచుకుపడింది. ఇరాన్ రక్షణ, నిఘా, డ్రోన్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
Also Read : సరిహద్దుల్లో ముగిసిన నిశ్శబ్దం: అఫ్గాన్ భూభాగంపై పాక్ దాడుల కలకలం
US Iran Ceasefire
అమెరికా వైమానిక దాడులకు ప్రతిగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) కూడా తీవ్రస్థాయిలో స్పందించింది. అమెరికా సైనిక స్థావరాలు ఎక్కువగా ఉన్న కువైట్, బహ్రెయిన్‌లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. కువైట్‌లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరం, బహ్రెయిన్ పోర్ట్ సల్మాన్‌లోని అమెరికా ఐదో నావికాదళ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించగా, తమ రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నాయని కువైట్ తెలిపింది. అయితే, బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒక 8 అంతస్తుల భవనం ఈ దాడుల్లో పాక్షికంగా ధ్వంసమైంది. ఈ సైనిక ఘర్షణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. “ఇరాన్ మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడితే ఆ దేశాన్ని భూమ్మీద లేకుండా చేస్తాం” అని హెచ్చరించగా, “మా జోలికి వస్తే అమెరికాకు నరకం చూపిస్తాం” అని ఇరాన్ అంతే ఘాటుగా బదులిచ్చింది.
పశ్చిమాసియాలో ఈ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ రవాణా, ముఖ్యంగా భారత వాణిజ్యంపై దీని ప్రభావం పడింది. వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి గుండా భారత్‌కు రావాల్సిన 15కు పైగా సరుకు రవాణా నౌకలు పర్షియన్ గల్ఫ్‌లోనే నిలిచిపోయాయి. వీటిలో ఎరువులు, ఇంధనంతో వస్తున్న 10 భారతీయ జెండా గల నౌకలు కూడా ఉన్నాయి. అయితే, గత మూడు రోజుల్లో ‘ఏపీజేప్రీతి2’, ‘దేశ్ సురక్ష’, ‘ప్రభు పార్వతి’ వంటి 7 నౌకలు సురక్షితంగా ఈ మార్గాన్ని దాటగలిగాయి. ఫిబ్రవరి 28న ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌కు చెందిన 44 నౌకలు ఈ మార్గం ద్వారానే ప్రయాణించాయి.
ప్రస్తుతం నెలకొన్న ఈ సంక్షోభాన్ని నివారించడానికి అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ ముమ్మర దౌత్య ప్రయత్నాలు ప్రారంభించింది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇరుదేశాల ప్రతినిధులతో పాటు యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ కాజా కల్లాస్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపి శాంతికి కట్టుబడి ఉండాలని కోరారు. అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) కూడా ఇరాన్ దాడులను ఖండించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం దోహాలో జరగబోయే చర్చలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ భేటీలో హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రత, వాణిజ్య రవాణా పునరుద్ధరణ, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలపై చర్చించనున్నారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు వంటి దీర్ఘకాలిక వివాదాలపై ఇంకా తుది అంగీకారం కుదరాల్సి ఉన్నందున, ఈ దోహా చర్చలు పూర్తిస్థాయి శాంతి ఒప్పందానికి దారితీస్తాయా లేదా అనేది వేచి చూడాలి.
Also Read : అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌తో సహా 8 దేశాల్లో ప్రకంపనలు









