
Volkswagen : ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన ఫోక్స్‌వ్యాగన్ రాబోయే కొన్నేళ్లలో ఏకంగా 1,00,000 మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తోంది. ఇది ఆ కంపెనీ ప్రపంచవ్యాప్త సిబ్బందిలో దాదాపు 15 శాతానికి సమానం. ఉద్యోగాల కోతతో పాటు జర్మనీలోని నాలుగు ఫ్యాక్టరీలను మూసివేయాలని, అలాగే రాబోయే ఐదేళ్లలో పెట్టే పెట్టుబడులను 15 శాతం తగ్గించుకోవాలని ఫోక్స్‌వ్యాగన్ భావిస్తోందని తెలుస్తోంది.
Also Read : ప్రపంచంలోనే తొలిసారి: పట్టాలపై దూసుకెళ్లనున్న సరికొత్త హైడ్రోజన్ రైళ్లు!
ఫోక్స్‌వ్యాగన్ మరో కీలక నిర్ణయం
అంతేకాకుండా ఫోక్స్‌వ్యాగన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫోక్స్‌వ్యాగన్ కార్ల విభాగాన్ని, అలాగే ఆటో విడిభాగాల వ్యాపారాన్ని విడివిడిగా విడదీసి వేర్వేరు సంస్థలుగా మార్చాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ పరిధిలోనే ఆడి, పోర్షే వంటి మరికొన్ని లగ్జరీ కార్ల బ్రాండ్లు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో 6,60,000 మంది పని చేస్తుండగా.. 2030 నాటికి జర్మనీలోనే 50,000 ఉద్యోగాలు తగ్గించాలనే ప్లాన్ ఇప్పటికే ఉంది.
మిగిలిన యూరప్ కార్ల కంపెనీల లాగే ఫోక్స్‌వ్యాగన్ కూడా ప్రస్తుతం తీవ్రమైన పోటీని, నష్టాలను ఎదుర్కొంటోంది. అమెరికాకు ఎగుమతి చేసే కార్లపై కొత్తగా పడుతున్న పన్నులు ఒక కారణమైతే.. చైనాకు చెందిన బివైడి వంటి ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు మార్కెట్‌ను ఆక్రమించుకోవడం మరో ప్రధాన కారణం. ఐరోపాలో కార్లు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే తమ పాత పద్ధతి ఇకపై అన్ని బ్రాండ్లకు వర్కవుట్ కాదని, అందుకే ఖర్చులు, పెట్టుబడులు తగ్గించుకోవక తప్పడం లేదని కంపెనీ అంటోంది.
అయితే, ఈ ఉద్యోగాల కోతను జర్మనీలోని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ కంపెనీ ఈ ప్లాన్‌తో ముందుకు వెళ్తే తమ శక్తినంతా ఉపయోగించి అడ్డుకుంటామని ఐజీ మెటల్ యూనియన్, వర్క్స్ కౌన్సిల్ హెచ్చరించాయి. ఈ వార్తల నేపథ్యంలో ఫోక్స్‌వ్యాగన్ షేర్లు మధ్యాహ్నం సమయానికి 1.5 శాతం పడిపోయాయి. ఈ ఏడాదిలోనే ఆ కంపెనీ స్టాక్ విలువ దాదాపు పావు వంతు (25% పైగా) క్షీణించడం గమనార్హం.
Also Read : ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. దెబ్బకు పాక్ సైనికుల జీతాలు పెంచిన మునీర్!









