Saudi Arabia :  అరబ్ దేశాల్లోనే అత్యంత పెద్ద దేశమైన సౌదీ అరేబియా ఇప్పుడు భారత్‌కు బాగా దగ్గరవుతోంది. ఇప్పటికే దుబాయ్ తో మన దేశానికి ఉన్న మంచి సంబంధాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సౌదీ అరేబియా కూడా భారత్‌తో తన దోస్తీని మరో లెవెల్‌కు తీసుకెళ్లాలని గట్టిగా ప్లాన్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో సౌదీలో కొన్ని ముఖ్యమైన మీటింగ్‌లు జరిగాయి. ఈ చర్చల తర్వాత మన రెండు దేశాల మధ్య కుదురుతున్న మిలిటరీ, ఆయుధాల ఒప్పందాల గురించి వింటే పొరుగు దేశమైన పాకిస్తాన్‌కు అస్సలు నిద్ర పట్టడం లేదు.

ఈ కథ అంతా సౌదీలోని జెద్దా నగరంలో మొదలైంది. అక్కడ భారత్, సౌదీ దేశాల పెద్ద అధికారులు ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా ఒకచోట కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్నారు. జెద్దాలో ఉన్న భారత అధికారి ఫహద్ అహ్మద్ ఖాన్ సూరి, సౌదీ విదేశాంగ శాఖకు చెందిన ఇబ్రహీం బిన్ సయీద్ అల్-సుభీ ముఖాముఖి కూర్చుని భవిష్యత్తు విషయాలపై చర్చలు జరిపారు. నిజానికి సౌదీ అరేబియా అంటే మనకు కేవలం పెట్రోల్, డీజిల్ ఇచ్చే దేశం మాత్రమే కాదు. అక్కడ లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తూ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థకు పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. అందుకే సౌదీ ప్రభుత్వం కూడా అక్కడ ఉంటున్న భారతీయుల రక్షణ గురించి చాలా సీరియస్‌గా ఆలోచిస్తూ, భారత్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది.

పాకిస్తాన్‌కు టెన్షన్

భారత్, సౌదీల మధ్య పెరుగుతున్న ఈ కొత్త స్నేహం కేవలం మాటలకే పరిమితం కావడం లేదు. ఇందులో ఇప్పుడు అసలైన రక్షణ శాఖ ట్విస్ట్ వచ్చింది. జెద్దాలో అధికారులు కలిసిన రోజే, సౌదీ రాజధాని రియాద్‌లో కూడా ఇంకో పెద్ద మిలిటరీ మీటింగ్ జరిగింది. సౌదీలో ఉన్న భారత రాయబారి డాక్టర్ సుహైల్ అజాజ్ ఖాన్ నేరుగా సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పెద్ద అధికారి ఇయాద్ అబ్దుల్ మలిక్ అల్-అల్షేఖ్‌ను కలిశారు. ఈ మీటింగ్ చూసి పాకిస్తాన్‌కు టెన్షన్ మొదలైంది. ఇరుదేశాల ఆర్మీలు కలిసి పనిచేయడం, సరికొత్త ఆయుధాలు, టెక్నాలజీని ఒకరికొకరు పంచుకోవడంపై ఈ మీటింగ్‌లో పెద్ద ప్లాన్ వేశారు. భారత్-సౌదీల మధ్య నమ్మకాన్ని, బంధాన్ని మరింత గట్టిగా మార్చడానికే ఈ చర్చలు జరిగాయని రియాద్‌లోని భారత ఎంబసీ అధికారికంగా ప్రకటించింది.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.