
Venezuela Earthquake : వెనిజులాలో వరుసగా రెండు భూకంపాలు సంభవించడంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు కనీసం 235 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 4,300 మంది గాయపడినట్లు వెనిజులా ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ఇక శిథిలాల కింద చిక్కుకుపోయిన సుమారు 40,000 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వరుస భూకంపాల అనంతరం దాదాపు 40వేల మంది జాడ తెలియరాలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
బుధవారం మధ్యాహ్నం రాజధాని కరాకస్ పశ్చిమ ప్రాంతంలో కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే 7.2 మరియు 7.5 తీవ్రతతో బ్యాక్-టు-బ్యాక్ భూకంపాలు సంభవించాయి. దీంతో వందలాది భవనాలు నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోయాయి. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా భారీ శిథిలాల దిబ్బలుగా మారిపోయింది. అత్యవసర రెస్క్యూ టీమ్‌లు, సహాయక సిబ్బంది రాత్రింబగళ్లు శ్రమిస్తూ శిథిలాలను తొలగించి, ప్రాణాలతో ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన బాధితులను స్ట్రెచర్లపై ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
Also Read : సాంకేతికత సృష్టించిన అద్భుతం… విపత్తు వేళ రక్షణ కవచంగా స్మార్ట్‌ఫోన్
ఎక్కడ చిక్కుకుపోయారో తెలియక
ఈ భయానక పరిస్థితిని చూసిన స్థానికులు.. ఇదంతా ఒక హారర్ సినిమా చూసినట్లు ఉందని కన్నీరు మున్నీరవుతున్నారు. శిథిలాల కింద తమ వారు ఎక్కడ చిక్కుకుపోయారో తెలియక, వారిని కాపాడాలంటూ కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు. “మేము శిథిలాలను దాటుకుంటూ ఎలాగోలా బయటపడ్డాం. మా పక్క బిల్డింగ్ నుంచి కేవలం ఒకే ఒక్క ఫ్యామిలీ సురక్షితంగా బయటకు రావడం నేను చూశాను, మిగతా వారి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు” అని మారియా అలెజాండ్రా అనే స్థానిక మహిళ తన ఆవేదనను పంచుకుంది.
ఈ విపత్తు నేపథ్యంలో వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ దేశంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. రాజధాని కరాకస్‌లో భవనాలు దారుణంగా దెబ్బతినడం, రన్వేలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కాగా, ఈ విపత్తు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, మరణాల సంఖ్య 10,000 దాటే అవకాశం 44 శాతం వరకు ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది.
Also Read : అమెరికా జెట్‌ను కూల్చిన వింత డ్రోన్.. ఇరాన్ చేతికి సరికొత్త జెల్లీఫిష్ టెక్నాలజీ!









