
RBI : క్రెడిట్ కార్డ్, డిజిటల్ బ్యాంకింగ్ మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే మోసపూరిత లావాదేవీలపై కస్టమర్ల నుండి ఫిర్యాదు వచ్చిన ఐదు రోజుల్లోగా.. బ్యాంకులు ఆ వివాదాస్పద మొత్తాన్ని షాడో రివర్సల్ చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలలో కస్టమర్ల బాధ్యతను పరిమితం చేసేందుకు ఉద్దేశించిన సవరించిన నిబంధనల ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్ర బ్యాంక్ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుండి అమలులోకి రానున్నాయి.
కస్టమర్లు డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలను ఎటువంటి భయం లేకుండా, సురక్షితంగా చేసుకునేలా బ్యాంకులు తమ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఇందులో భాగంగా రూ. 500 కంటే ఎక్కువ విలువైన ప్రతి డిజిటల్ లావాదేవీకి బ్యాంకులు కస్టమర్లకు తప్పనిసరిగా తక్షణ SMS అలర్ట్ పంపాలి. రూ. 500 లోపు లావాదేవీలకు SMS పంపాలా వద్దా అనేది బ్యాంకులు తమ సొంత పాలసీ ప్రకారం నిర్ణయించుకోవచ్చు, కానీ దీనికోసం కస్టమర్ల నుండి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. అలాగే, కస్టమర్లకు సందేశం అందిన సమయం, దానికి వారు స్పందించిన సమయాన్ని బ్యాంకుల కమ్యూనికేషన్ సిస్టమ్స్ కచ్చితంగా రికార్డు చేయాలి.
Also Read : ఫొటోల కోసం కాదు.. ప్రాణాలు తీయడానికే.. కేతన్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్!
డబ్బులు కట్ అయ్యాయని
ఒకవేళ కస్టమర్ తన ఖాతా నుండి మోసపూరితంగా డబ్బులు కట్ అయ్యాయని ఫిర్యాదు చేస్తే.. తదుపరి అనధికార లావాదేవీలు జరగకుండా బ్యాంకులు వెంటనే చర్యలు తీసుకోవాలి. బ్యాంక్ వైపు ఉన్న లోపాలు లేదా నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి మోసాలు జరిగితే.. కస్టమర్ ఆ విషయాన్ని ఫిర్యాదు చేసినా, చేయకపోయినా అతనికి ఎటువంటి బాధ్యత ఉండదు. ఆ డబ్బును బ్యాంకే పూర్తిగా వెనక్కి ఇచ్చేయాలి. ఒకవేళ థర్డ్ పార్టీ వల్ల మోసం జరిగితే.. ఆ విషయం తెలిసిన ఐదు రోజుల్లోగా కస్టమర్ బ్యాంకుకు సమాచారం అందిస్తే, అప్పుడు కూడా కస్టమర్‌కు ఎలాంటి నష్టం లేకుండా పూర్తి మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలి. ఒకవేళ 5 రోజులు దాటిన తర్వాత ఫిర్యాదు చేస్తే, కస్టమర్ బాధ్యత ఎంత అనేది బ్యాంక్ నిబంధనల ప్రకారం నిర్ణయిస్తారు.
బ్యాంకులు ఈ మోసపూరిత సొమ్మును కస్టమర్ ఖాతాలో మళ్లీ జమ చేసేటప్పుడు, ఆ మోసం జరిగిన అసలు తేదీ ప్రకారమే జమ చేయాలి. దీనివల్ల కస్టమర్ ఎలాంటి వడ్డీ నష్టపోకూడదు లేదా అదనపు ఛార్జీల భారం పడకూడదు. అయితే, ఒకవేళ కస్టమర్ నిర్లక్ష్యం వల్లే మోసం జరిగితే మాత్రం, దానికి కస్టమరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ, కస్టమర్ బ్యాంకుకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆ ఖాతాలో ఏవైనా అనధికార లావాదేవీలు జరిగితే, ఆ నష్టాన్ని పూర్తిగా బ్యాంకే భరించాలి.
చిన్న మొత్తాల మోసాలకు గురయ్యే బాధితుల కోసం ఆర్‌బీఐ ఒక ప్రత్యేక పరిహార విధానాన్ని తెచ్చింది. ఒక కస్టమర్ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. రూ. 50,000 లోపు డిజిటల్ మోసానికి గురైన నిజాయితీ గల బాధితుడికి.. నికర నష్టంలో 85 శాతం లేదా రూ. 25,000 పరిహారంగా అందుతుంది. ఉదాహరణకు, రూ. 29,412 కంటే తక్కువ నష్టం జరిగి 85 శాతం పరిహారం చెల్లించాల్సి వస్తే.. దేశీయ మోసాల కేసులలో ఆ నష్టంలో 65 శాతాన్ని రిజర్వ్ బ్యాంక్, 10 శాతాన్ని కస్టమర్ బ్యాంక్, మిగిలిన 10 శాతాన్ని డబ్బులు అక్రమంగా వెళ్లిన బ్యాంక్ భరిస్తాయి. కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకులకు ఆర్‌బీఐ విడివిడిగా ఈ ఆదేశాలను జారీ చేసింది.
Also Read : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఎయిమ్స్‌లో 1,484 ఉద్యోగాలు









