
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన టాప్-500 సూపర్కంప్యూటర్ల గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అమెరికాను వెనక్కి నెట్టి చైనా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. చైనాలోని షెన్జెన్లో ఉన్న నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్ సొంతంగా తయారు చేసిన ‘లైన్‌షైన్’ (Lineshine) అనే సూపర్‌కంప్యూటర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా రికార్డు సృష్టించింది. గత మూడేళ్లుగా ఈ జాబితాలో వెనుకబడిన చైనా, ఇప్పుడు మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. జూన్ 2026 నాటి తాజా ఎడిషన్‌లో లైన్‌షైన్ సిస్టమ్.. అమెరికా రక్షణ శాఖ ఆధ్వర్యంలోని లారెన్స్ లివర్మోర్ నేషనల్ లాబొరేటరీలో ఉన్న El Capitan సూపర్‌కంప్యూటర్‌ను ఓడించి ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
అయితే ఈ విజయంపై అంతర్జాతీయ నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చైనా నంబర్ వన్ ర్యాంకు సాధించినంత మాత్రాన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో చైనా వద్దే అత్యంత వేగవంతమైన కంప్యూటర్ ఉందని నమ్మలేమని స్పష్టం చేస్తున్నారు. సూపర్కంప్యూటర్ల వేగాన్ని కొలవడానికి దశాబ్దాలుగా ఒకే రకమైన సాంప్రదాయ పరీక్షలను వాడుతున్నారు. అంటే.. అణువులు ఒకదానితో ఒకటి ఎలా సంకర్షణ చెందుతాయి, వాతావరణ మార్పులు ఎలా ఉంటాయి వంటి సంక్లిష్టమైన శాస్త్రీయ సమస్యలను లెక్కించే వేగాన్ని బట్టి ఈ ర్యాంకులు ఇస్తారు.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కంప్యూటర్లు ప్రభుత్వాల దగ్గర లేదా విశ్వవిద్యాలయాల దగ్గర లేవు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఎలాన్ మాస్క్‌కు చెందిన xAI వంటి ప్రైవేట్ క్లౌడ్ కంపెనీలు తమ సొంత అవసరాల కోసం ఊహించని పరిమాణంలో భారీ సూపర్కంప్యూటర్లను నిర్మించుకున్నాయి. ఎలాన్ మాస్క్‌కు చెందిన xAI సంస్థ వాడుతున్న కొలోసస్ అనే కంప్యూటింగ్ సిస్టమ్, అమెరికా ప్రభుత్వ అధికారిక నంబర్ వన్ కంప్యూటర్ అయిన El Capita కంటే ఎంతో శక్తివంతమైనది. కానీ ఈ కార్పొరేట్ కంపెనీలు ఏవీ కూడా తమ కంప్యూటర్ల వివరాలను గ్లోబల్ TOP 500 పోటీల కోసం సమర్పించడానికి ఇష్టపడవు. ఒకవేళ ఈ హైపర్‌స్కేలర్స్ గనుక తమ దగ్గరున్న అసలైన AI సూపర్కంప్యూటర్ల డేటాను గ్లోబల్ పోటీలకు పంపించి ఉంటే.. ఇప్పుడు నంబర్ వన్ స్థానంలో నిలిచిన చైనా ‘లైన్‌షైన్’ కనీసం ప్రపంచంలోని టాప్-5 స్థానాల్లో కూడా నిలబడలేదని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ సీనియర్ ఫెలో జిమ్మీ గూడ్రిచ్ స్పష్టం చేశారు.
అభివృద్ధి చెందుతున్న క్వాంటం కంప్యూటింగ్ (Quantum Computing) రంగంలో చైనా కంటే అమెరికాను ముందుంచే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ఒక ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. గతంలో ట్రంప్ మొదటి ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన జో బైడెన్ ప్రభుత్వాలు చైనాకు అధునాతన చిప్స్, సూపర్ కంప్యూటర్ విడిభాగాలు, తయారీ పరికరాలు అందకుండా కఠినమైన ఎగుమతి ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల కారణంగానే చైనా 2023 నుండి తన కంప్యూటర్లను ఈ గ్లోబల్ పోటీలకు పంపించడం ఆపేసింది. కానీ ఈ మూడేళ్ల కాలంలో చైనా ఇతరులపై ఆధారపడకుండా, సొంతంగా దేశీయంగానే చిప్‌లను డిజైన్ చేసుకుని ఈ లైన్‌షైన్ సిస్టమ్‌ను నిర్మించింది.
చైనా ఈసారి నంబర్ వన్ స్థానాన్ని సాధించడం కంటే.. ఆ వివరాలను ప్రపంచానికి అధికారికంగా సమర్పించడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే సాధారణంగా చైనా తన రక్షణ, అధునాతన సాంకేతిక రహస్యాలను అంత త్వరగా బయటపెట్టదు. నిపుణుల విశ్లేషణ ప్రకారం చైనా ఈ వివరాలను బయటపెట్టడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని అనుమానిస్తున్నారు. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, తమ సాంకేతిక ఎదుగుదలను ఆపలేరని, తాము ఒంటరిగానే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కంప్యూటర్ను నిర్మించగలమని బీజింగ్ నిరూపించాలనుకుంది. మొత్తంగా చూస్తే.. చైనా కేవలం సంఖ్యల పరంగా అమెరికా ప్రభుత్వ కంప్యూటర్ను దాటినప్పటికీ.. అసలైన AI టెక్నాలజీ పరంగా అమెరికా ప్రైవేట్ సంస్థలదే ఇప్పటికీ పైచేయి అని నిపుణులు చెబుతున్నారు.









